సీఎం రేవంత్​ను తాకే దమ్ము కేటీఆర్​కు ఉందా : మందుల సామెల్

మోత్కూర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి త్వరలోనే ఇంటికి పోతారని కేటీఆర్ అంటున్నారని, రేవంత్​ రెడ్డిని తాకే దమ్ము కేటీఆర్​కు  ఉందా అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్  ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల్లో బుధవారం ఆయన కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల అరాచకాలను చూసే ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావును ఇంటికి పంపారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయని తెలిపారు. 

లగచర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కేటీఆర్ మంత్రిగా నల్లగొండ, తుంగతుర్తికి రెండు, మూడుసార్లు వచ్చినా.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. బిక్కేరు ఇసుక మాఫియా, భూమాఫియాలో కేటీఆర్, హరీశ్​, కవిత కు వాటా లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జి. కవితలక్ష్మి నర్సింహారెడ్డి, కాంగ్రెస్ లీడర్లు అవిశెట్టి అవిలిమల్లు, గుండగోని రామచంద్రు ఉన్నారు.