- ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేశ్ షెట్కార్
ఎల్లారెడ్డి,వెలుగు : ఎల్లారెడ్డి మున్సిపల్ టౌన్ ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా రజిత వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ గా రాజు, డైరెక్టర్లుగా లింగంపేట్, నాగిరెడ్డి పేట్ ఎల్లారెడ్డి మండలాలకు చెందిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మదన్ మోహన్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీని నూతన కమిటీ అభివృద్ధి చేయాలన్నారు.
ఎల్లారెడ్డితో పాటు సదాశివనగర్, గాంధారి కమిటీలకు నూతన చైర్మన్లను నియమించడం జరిగిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతీకార్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరి, మక్క, పత్తితోపాటు ఇతర లాభదాయకమైన పంటలను సాగుచేయాలన్నారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ అందుబాటులో ఉన్నందున అగ్రికల్చర్ విద్యనభ్యసించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. తాను కూడా అగ్రికల్చర్ కాలేజీలో చదువుకున్నట్లు తెలిపారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో ఆందోళన చెందొద్దని, ప్రతీ ఒక్కరికి రుణమాఫీ జరిగేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. నియోజకవర్గంలో 29,739 మందికి రుణమాఫీ జరిగిందని తెలిపారు. మోతే, కాటేవాడి, గుజ్జులు ప్రాజెక్టులు పూర్తి చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని కరువులేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
అనంతరం నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సాయిబాబా, నాయకులు సామెల్, ఉషాగౌడ్, ప్రశాంత్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.