సమాజంలో వైద్య వృత్తి సేవ లాంటిది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, మర్రిగూడ, నాంపల్లి, వెలుగు : సమాజంలో వైద్య వృత్తి సేవలాంటిదని, కమిట్​మెంట్​తో వైద్యులు పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని సీహెచ్ సీలో రూ.70 లక్షలతో డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం కిడ్నీ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మండలంలోని కిడ్నీ పేషెంట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

పేషెంట్ల తాకిడిని బట్టి 24 గంటలు డయాలసిస్ కేంద్రం పనిచేయాలన్నారు. అనంతరం స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలను ఆయన సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని పీహెచ్​సీ, ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆయా కార్యక్రమాల్లో నల్గొండ డీఎంహెచ్ పుట్ట మధు, డీసీహెచ్ డాక్టర్ మాతృ, మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​శంకర్ నాయక్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రావు, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. 

రోడ్లు రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలి..

మునుగోడు, వెలుగు : నియోజకవర్గంలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు.