ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు : రాజగోపాల్ రెడ్డి

  • ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : ఎవరైనా ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. గురువారం చండూరు మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడడానికి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. కచ్చితంగా రోడ్డు సెంటర్ పాయింట్ నుంచి అటు, ఇటు 50 ఫీట్లు వరకు విస్తరణ పనులు చేపట్టాల్సిందేనని క్లారిటీ ఇచ్చారు. వర్షపు నీరు, మురుగునీరు కలవకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, భవిష్యత్​లో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు.

అంతకుముందు చండూరు పట్టణంలో రోడ్డు వెడల్పులో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. అనంతరం చండూరు మున్సిపాలిటీలో బజ్జీల బండి, కిరాణా షాపును తనిఖీ చేశారు. ఆయిల్ ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరూ కల్తీ నూనెలు వాడొద్దని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్  నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.