మునుగోడును ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, మునుగోడు, వెలుగు : మునుగోడును ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని హరిత పారిశ్రామిక పార్కులో డాక్టర్ ప్రసాద్ నెలకొల్పిన రమణి బయో కాంపోస్టికా​పరిశ్రమను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమి తల్లి లాంటిదని, భూమాతను కాపాడుకునేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. పూర్వీకులు ప్లాస్టిక్​వాడకపోవడంతో ఆరోగ్యంగా జీవించారని గుర్తుచేశారు.

నేడు ఆహారం, పాలు, నూనె, గాలి, మట్టి అన్ని కలుషితమయ్యాయని, దీంతో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీలు విడుదల చేసే కాలుష్యం, మూసీ మురికితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. పర్యావరణానికి, ప్రజలకు మేలు చేసేవిధంగా రమణి బయో కాంపోస్టికా పరిశ్రమలో సంచులు తయారు చేయనున్నట్లు తెలిపారు. పిల్లలకు ఆస్తుల కంటే ముందు ఆరోగ్యాన్ని అందించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సూచించారు. ప్లాస్టిక్ వాడకంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

ప్లాస్టిక్​వాడడంతో మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నామని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. వాడి పడవేసిన ప్లాస్టిక్ భూమిలో కరగకపోవడంతో పంటలు దెబ్బతింటాయని చెప్పారు. ప్లాస్టిక్ సంచులకు బదులు భూమిలో కరిగిపోయే బయో డీ గ్రేడబుల్ సంచులను వాడాలని సూచించారు. అనంతరం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని డీఈవో, ఎంఈవోలతో  ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు.