విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, మునుగోడు, వెలుగు : విద్య, వైద్యరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం  మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న  ఉన్న 52  ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్ట పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా డాక్టర్లు, వైద్యాధికారులు పనిచేయాలని చెప్పారు.

వైద్యరంగంలో మునుగోడు నియోజకవర్గ మోడల్ గా తీర్చిదిద్దాలని సూచించారు. నారాయణపూర్, నాంపల్లి, మునుగోడు ప్రాథమిక  గా అప్​గ్రేడ్​ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ పౌండేషన్ ద్వారా 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.

చండూరు మండలం కొండాపురం శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్( పెట్రోల్ బంక్) ను ఆయన ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు, కొండాపురం గ్రామ మాజీ సర్పంచ్ గాదే సత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో నల్గొండ, యాదాద్రి డీఎంహెచ్​వోలు శ్రీనివాస్, మనోహర్, డీసీహెచ్ డాక్టర్ మాతృ, వైద్యాధికారులు, కాంగ్రెస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

మళ్లీ ఫ్లోరైడ్ జాడలు బయట పడుతున్నాయి..

నియోజకవర్గంలో మళ్లీ ఫ్లోరైడ్ జాడలు బయటపడుతున్నాయని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా చేయాలని చెప్పారు.