డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే .. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : కవ్వంపల్లి సత్యనారాయణ

  • రసమయి, కౌశిక్ ఇష్టానుసారంగా మాట్లాడతామంటే తగిన శాస్తి తప్పదు

కరీంనగర్, వెలుగు : రసమయి, కౌశిక్ కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారని, ఇష్టానుసారం మాట్లాడతామంటే తగిన శాస్తి తప్పదని డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో ఫోన్ల ట్యాపింగ్ విషయం అందరికీ తెలుసన్నారు. తమ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. కరీంనగర్ లోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో శుక్రవారం మీడియా సమావేశంలో కవ్వంపల్లి మాట్లాడుతూ.. కరీంనగర్ సీపీతో తనకు ఎలాంటి వైరం లేదని, తప్పుగా మాట్లాడలేద న్నారు. 

మంచి చేస్తే సమర్థిస్తానని, చెడు చేస్తే వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు. నలుగురు దళిత సీఐలకు పోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఇచ్చిన ఆర్డర్ ను సీపీ పట్టించుకోలేదని, వారిని జాయిన్ చేసుకోకుండానే వెనక్కి పంపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రసమయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఐలను నియమించుకోగా, ఇప్పుడు తాను దళిత వర్గానికి చెందిన సీఐలు ఉండాలని కోరుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. వారి వద్ద చిల్లి గవ్వ తీసుకున్నట్లు నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. ఈ సమావేశంలో మానకొండూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.