స్టూడెంట్స్​కు మెనూ పక్కాగా అమలు చేయాలి : ఎమ్మెల్యే మట్టా రాగమయి

కల్లూరు, వెలుగు :  ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోని స్టూడెంట్స్​కు పక్కాగా మెనూ అమలు చేస్తూ నాణ్యమైన భోజనం అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా  రాగమయి అధికారులను ఆదేశించారు. స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం సరిగా ఉడకలేదని, చారు నీళ్లలగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు  రుచికరమైన ఆహారం అందించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

 అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బాత్ రూమ్ లు సరిపోవటం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి రాగా ఉపాధి హామీ పథకం కింద మరికొన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలోకి కోతులు రాకుండా  సోలార్ పెన్షన్ ఏర్పాటు విషయమై కలెక్టర్ దృష్టికి  తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా  దయానంద్ విజయకుమార్, ఏఎంసీ చైర్మన్  భాగం నీరజ ప్రభాకర్ చౌదరి పాఠశాల ఇన్​చార్జి  ప్రిన్సిపాల్  కనకదుర్గ, ఎండీవో డి.చంద్రశేఖర్  పాల్గొన్నారు. 

డోజర్ ట్రాక్టర్ ప్రారంభం

సత్తుపల్లి : పట్టణ అభివృద్ధి కార్యక్రమాల కోసం మున్సిపల్ నిధులతో కొనుగోలు చేసిన డోజర్ ట్రాక్టర్ ను ఆదివారం ఎమ్మెల్యే రాగమయి, మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేశ్​ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు పీపీటీ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ తోట సుజాల రాణి, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.