- అర్బన్ ఎమ్మెల్యే సూర్య నారాయణ
నిజామాబాద్ సిటీ వెలుగు: నగర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, వివిధ విభాగాల మున్సిపల్ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. రెవెన్యూ, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వర్షాకాలానికి ముందే గుంతలు పూడ్చాలని ఆదేశించినా పూర్తి కాలేదని మండిపడ్డారు.
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నారి అనన్య సంఘటన కలిచివేసిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కావొద్దని హెచ్చరించారు. శిథిలాస్థలో ఉన్న ఇళ్లను గుర్తించాలని, ప్రమాదం సంభవించకముందే చర్యలు చేపట్టాలన్నారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా సిబ్బందిని అధికారులు ఆదేశించాలన్నారు. కుక్కలు, కోతుల బెడద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ శంకర్, మున్సిపల్ మేనేజర్ జనార్ధన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ, మురళి,ఉన్నత అధికారులు పాల్గొన్నారు.