కుర్చీ కాపాడుకోవడానికే  సీఎం ఢిల్లీ టూర్లు : ధన్ పాల్ సూర్యనారాయణ 

  • ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్​, వెలుగు : సీఎంగా రేవంత్​రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఆరు నెలల్లో కుర్చీ కాపాడుకోవడానికే 11 సార్లు ఢిల్లీ ప్రదక్షిణలు చేశారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు.  శుక్రవారం బీజేపీ జిల్లా పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రజా సమస్యలను గాలికొదిలేసి బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన కుంభకోణాల నుంచి కేసీఆర్​ను కాపాడడానికి సీఎం పావులు  కదుపుతున్నారన్నారు. కరెంట్​ కొనుగోలు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ కుంభకోణాలు, ఫోన్​ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌తో  కేసీఆర్ రాజకీయ జీవితం పూర్తిగా మసకబారిపోయిందన్నారు.

 ప్రైవేట్​ విద్యాసంస్థల ఫీజు దోపిడీని ఆపేవారు లేకుండా పోయారన్నారు.  సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సొంత జిల్లాల్లో ప్రాజెక్టు పైలెట్​గా ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.  ఏబీవీపీ కార్యకర్తలు బంద్‌‌‌‌‌‌‌‌కు పిలుపునిస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం ఏమిటన్నారు. సీఎం గులాంలుగా పనిచేసే పోలీసు ఆఫీసర్లు జిల్లా విడిచి వెళ్లాలన్నారు. హోం శాఖను తన వద్ద పెట్టుకున్న రేవంత్​రెడ్డి ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఆరు గ్యారెంటీలను చూపి అధికారం చేపట్టిన రేవంత్​ ప్రజలకు గాడిద గుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ పార్లమెంట్​ సాక్షిగా దేశ రాజ్యాంగాన్ని అవహేళన చేశారని బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు.  పలువురు బీజేపీ లీడర్లు ఉన్నారు.