కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి : ఎమ్మెల్యే సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, వెలుగు: కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.  పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద రూ.1,00,116 అందజేయడం సంతోషంగా ఉందన్నారు.  ఎన్నికల ముందు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 

 ఏడాది గడుస్తున్నా  తులం బంగారానికి మోక్షం కలగలేదన్నారు.  కాంగ్రెస్ నాయకులు విజయోత్సవాల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేయడం తప్ప రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిలేదని విమర్శించారు. చెక్కుల జారీ విషయంలో కూడా జాప్యం జరుగుతోందని మిత్తికి తెచ్చిన డబ్బులకు సగం వడ్డీ చెల్లించాల్సి వస్తోందని,  దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లో చెక్కులు విడుదల చేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీలో విజ్ఞప్తి చేస్తానన్నారు. అనంతరం సౌత్, నార్త్ జోన్లకు చెందిన 801మంది లబ్ధిదారులకు రూ.8,01,92,916  విలువ గల చెక్కులు పంపిణీ చేశారు.