ఆలేరును రెవెన్యూ డివిజన్​ చేయాలి : బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : ఆలేరును రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ డిమాండ్​20 ఏండ్లుగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వంలో కొత్తగా డివిజన్లు ఏర్పాటు చేసినా శాస్త్రీయంగా జరగలేదన్నారు. యాదాద్రి జిల్లాలో 17 మండలాలు ఉంటే రెండు రెవెన్యూ డివిజన్లు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కొత్త మండలాల ఏర్పాటు విషయంలోనూ తప్పులు జరిగాయని చెప్పారు.

ఒక మండలం పక్కనే ఉన్న గ్రామాలను 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలంలో కలిపారని పేర్కొన్నారు. రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. రఘునాథపురం గ్రామాన్ని నూతన మండల ఏర్పాటును పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.