గజం జాగా తీసుకోకుండా గందమల్ల రిజర్వాయర్ కడ్తం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

  • 1.4 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మాణం

యాదగిరిగుట్ట, వెలుగు:  రైతుల  నుంచి గజం భూమిని తీసుకోకుండా గందమల్ల చెరువును రిజర్వాయర్ గా మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. 1.4 టీఎంసీల వాటర్ కెపాసిటీతో గందమల్ల రిజర్వాయర్ ను నిర్మిస్తామని  హామీ ఇచ్చారు. తుర్కపల్లి మండలం గందమల్ల గ్రామంలోని  చెరువు మత్తడి పోస్తోంది. దీంతో బుధవారం ఆయన గందమల్ల చెరువును సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

గందమల్ల చెరువు నింపితే తాత్కాలికంగా రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లానని  వారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించి మల్లన్న సాగర్ నుండి గందమల్ల చెరువులోకి గోదావరి జలాలను వదిలారని తెలిపారు. ఆలేరు రైతుల కష్టాలను తీర్చడం కోసం గందమల్ల చెరువును నింపిన  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, ఉత్తమ్ కు చేతులెత్తి దండం పెడుతున్నానన్నారు. 

రైతుల నుండి గుంట భూమి సేకరించకుండా, గందమల్ల గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ప్రస్తుతం ఉన్న చెరువునే రిజర్వాయర్ గా అభివృద్ధి చేసి 50 వేల ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు.  అలాగే తపాసుపల్లి రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా కూడా గోదావరి జలాలను ఆలేరుకు తరలించి రైతుల ఇబ్బందులను తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం త్రికరణ శుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేశారు.