గోదావరి జలాలతో రైతుల గోడు తీర్చుతాం : ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గుంటను తడిపి రైతుల గోడును తీర్చుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి, దాతరుపల్లిలో కాల్వలను ఆఫీసర్లతో కలిసి ఆయన సందర్శించారు. తుర్కపల్లి మండలం సంగ్యాతండా, తోకచెరువుకు నీటిని సరఫరా చేసే పైప్ లైన్ ను పరిశీలించారు.

అనంతరం మల్కాపూర్ శివారులోని కాల్వ వద్ద డిస్ట్రిబ్యూటరీ పాయింట్ ఏర్పాటు చేసి దిగువ గ్రామాలకు గోదావరి జలాలను ఏ విధంగా తరలించవచ్చో గ్రౌండ్ లెవల్ లో విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నా రైతుల కష్టాలను తీర్చడం కోసం మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను గంధమల్ల చెరువుకు తరలించి నింపామన్నారు.

గంధమల్ల చెరువు మత్తడి ద్వారా దిగువ గ్రామాల చెరువులను నింపుతూ గుండాల వరకు నీళ్లను తరలించామని తెలిపారు. అదేవిధంగా తపాసుపల్లి, నవాబుపేట రిజర్వాయర్ల ద్వారా రాజాపేట, ఆలేరు, గుండాల తదితర ప్రాంతాలను గోదావరి జలాలతో తడిపామని గుర్తుచేశారు. మిగతా చెరువులన్నీ దీపావళిలోపు నింపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్ తదితరులు ఉన్నారు.