- అవసరమైతే నా భూమి అమ్మి ఖర్చు చేస్తా
- మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా ఓకే
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదాద్రి, వెలుగు : ఆలేరు అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల కాళ్లు పట్టుకొనైనా నిధులు సాధిస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ప్రజా పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''తాను నాయకుడిని కాదని, ప్రజా సేవకుడనని, ఆలేరు అభివృద్ధి చేయాలనే ఎమ్మెల్యే అయ్యా. అందుకే అన్ని నియోజకవర్గాల స్థాయిలో నిధులు సాధించుకుంటున్న. అవసరమైతే నా సొంత భూమి ఎకరం అమ్మి అభివృద్ధికి ఖర్చు చేస్తా” అని ఐలయ్య స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేగా తనకు వస్తున్న జీతంతోపాటు మరో రెండు మూడు లక్షలు ప్రజల కోసం ఖర్చు చేస్తున్నానని తెలిపారు.గత సర్కారు.. ప్రొసిడింగ్లే ఇచ్చింది.. కానీ పనులు చేయించలేదన్నారు. తాను ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా నిధులు సాధించి, రూ.560 కోట్ల విలువైన పనులు పూర్తి చేయించానని చెప్పారు. సాగునీటిని అందించడానికి తన సొంత డబ్బు ఖర్చు చేసి కాల్వలు మరమ్మతులు చేయించి, 120 చెరువుల్లో నీటిని నింపానని తెలిపారు. అవసరమైతే మోటార్ల ద్వారా చెరువుల్లో నీటిని నింపుతానని చెప్పారు. త్వరలో గంధమల్ల రిజర్వాయర్పనులు చేపడుతామన్నారు.
రైతుల ప్రయోజనమే తన స్వార్థమని, గోదారి నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతానని తెలిపారు. రూ.210 కోట్లతో చేపట్టిన పైపులైన్పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలోగా ఆలేరులోని అన్ని గ్రామాలకు, భువనగిరి, జనగామ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని వివరించారు. మెడికల్‌కాలేజీ కోసం పెద్దగుట్ట మీద 20 ఎకరాలను సేకరిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలోనే 4,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానన్నారు.
మంత్రి పదవి ఇస్తే ఓకే..
బీసీ కోటాలో తన సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకొని మంత్రి పదవి ఇస్తారనని భావిస్తున్నానని ఐలయ్య చెప్పారు. అయితే తాను కాంగ్రెస్‌కు విధేయుడనని, పార్టీ చెప్పింది చేయడమే తన పని అని చెప్పారు. తనకు ఇప్పటికే కేబినెట్ర్యాంక్ కలిగిన ప్రభుత్వ విప్ ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వకున్నా బాధేమీ ఉండదని చెప్పారు.
జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తా..
జర్నలిస్టులకు ఖాళీ స్థలాలు ఇప్పిస్తానని, దీంతోపాటు ఇండ్లు కూడా నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు. జర్నలిస్టుల కోసం జనవరిలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రతి సోమవారం జర్నలిస్టులకు ప్రత్యేకంగా లక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం చేయించే విధంగా ఈవో భాస్కర్‌రావుతో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలిపారు.