క్రీడాకారులను ప్రోత్సహించాలి : బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను మంగళవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు స్కైలాబ్ నాయక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నమెంట్లను నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం టోర్నీ నిర్వాహకులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా స్థాయి  టోర్నీకి 30 టీమ్​లు వచ్చాయన్నారు. విజేతలకు నగదు బహుమతులు రూ.25 నుంచి రూ.12 వేల వరకు అందించనున్నట్లు తెలిపారు. క్రీడాకారుల వ్యక్తిగత ప్రదర్శనకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజర్లు వెంకన్న, నాగరాజు, మనోహర్, భీమేశ్, అశోక్, రమేశ్, లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.