పది పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి : ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి, వెలుగు : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా టీచర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికతోపాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. 

అనంతరం జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం నుంచి తుంగతుర్తి మండల సంగెం గ్రామం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఇంతకుముందు తిరుమలగిరి మండల కేంద్రంలో తిరుమలగిరి, నాగారం, జాజేటిగూడెం,  మద్దిరాల మండలాలకు సంబంధించిన 108 నూతన వాహనాలను జండా ఊపి ప్రారంభించారు.  ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు బండారు శేఖర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.