మంత్రి పదవి ఇవ్వాలని CM రేవంత్‎ని అడిగినా: విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు: త్వరలో  కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోన్న వేళ మంత్రి పదవిపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనస్సులో మాట బయటపెట్టారు. ఇవాళ (అక్టోబర్ 6) యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని అడిగానని చెప్పారు. 

ALSO READ | పదేండ్లలో KCR ఏనాడైనా సెక్రటేరియట్‎కు వచ్చారా..? మంత్రి కోమటిరెడ్డి

కొండపోచమ్మ, మల్లన్నసాగర్, నవాబ్ పేట, తపాసుపల్లి రిజర్వాయర్ల ద్వారా ఆలేరుకు గోదావరి జలాలను‌ అందించామని.. సీఎం, మంత్రుల కాళ్లు పట్టుకుని మరీ ఆలేరుకు గోదావరి నీళ్లు తెచ్చామన్నారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ సమస్యలతో ఆగిపోయిన రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేస్తామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఐలయ్య ఆకాంక్షించారు.