ఒక యుద్ధం జరిగిందంటే దాని వెనుక అనేక కారణాలు ఉంటాయి. కానీ.. ఇక్కడ మాత్రం ట్రంపెట్లు వాయిస్తే.. చాలు యుద్ధం జరుగుతుంది. దీని నుంచి వార్ సౌండ్ వస్తుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కూడా ఈ ట్రంపెట్లు వాయించడమే కారణమని కొందరు చెప్తారు.ఆరు రోజుల యుద్ధంలో వేలమంది ప్రాణాలు పోవడానికి కూడా ఇదే కారణమట! ఇంతకీ ఈ ట్రంపెట్లు ఎక్కడున్నాయి? ఎవరివి? ట్రంపెట్లకి యుద్ధాలతో సంబంధం ఏంటి?
ఈజిప్టు అనగానే పిరమిడ్లు, సమాధులు గుర్తొస్తాయి. ఆ సమాధుల్లో దొరికినవే ఈ ట్రంపెట్లు.1922లో ఈజిప్టులోని టుటన్‌ఖామున్ సమాధిలో పురావస్తు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేశారు. ఆ టైంలో సమాధి నుంచి చాలా వస్తువులు బయటపడ్డాయి. వాటిలో రెండు పురాతన వాయిద్యాలు కూడా ఉన్నాయి. వాటిని ‘టుటన్‌ఖామున్ ట్రంపెట్స్’ అని పిలుస్తుంటారు. ఇవి ప్రపంచంలోనే చాలా అరుదైన ట్రంపెట్స్. వాటిలో ఒకదాన్ని కాంస్యంతో తయారు చేశారు.
మరొకటి వెండితో చేశారు. రెండింటికీ చెక్క కోర్ ఉంది. దానిపై రా-హోరాఖ్టీ, ప్తా, అమున్ దేవతల చిత్రాలు చెక్కారు. వీటి పొడవు 58 సెంటిమీటర్లు (22.83 అంగుళాలు), వెడల్పు 4 సెంటిమీటర్లు (1.57 అంగుళాలు). ఈజిప్టు రాజులు వీటిని సైనిక ప్రయోజనాల కోసం వాడేవాళ్లని నమ్ముతున్నారు. కింగ్ టుట్ తన సైన్యాలతో కమ్యూనికేట్ చేయడానికి వాటిని ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
మొదట్నించీ...
ఈ ట్రంపెట్లు కనుగొన్నప్పటినుంచి... వీటి వెనుక అనేక మిస్టరీలు ఉన్నాయని నమ్ముతున్నారు ఆర్కియాలజిస్ట్‌లు. ఎందుకంటే.. వీటిని కనుగొన్నప్పుడు హోవార్డ్ మొదట ఏమీ చూడలేకపోయాడు. ఆ వస్తువుల నుంచి వచ్చిన కాంతి వల్ల అక్కడ ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత కాసేపటికి వింత జంతువులు, విగ్రహాలు, బంగారం అస్పష్టంగా కనిపించాయి. వాటిని చూసి హోవార్డ్ గొంతు మూగబోయింది.
రాజు మరణానంతర జీవితంలో అనుభవించడానికి కావాల్సిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు అక్కడ. రథాలు, కుర్చీలు, ఆభరణాలు, ఫుడ్‌ప్యాకెట్స్, కొంత సంపద ఉన్నాయి. ఆ సమాధిని గుర్తించినప్పటి నుంచి హోవార్డ్ టీమ్‌కు మమ్మీల శాపం తగిలిందని అందరూ నమ్మారు. పదేండ్లలోనే అతని టీమ్‌లోని 58 మందిలో ఎనిమిది మంది చనిపోయారు. ఆ తర్వాత 1939లో హోవార్డ్ కూడా చనిపోయాడు.
యుద్ధాలు
ఈ ట్రంపెట్లు సమాధిలో దాచి దాదాపు మూడువేల ఏండ్లు అయ్యింది. అప్పటినుంచి వాటిని ఎవరూ మోగించలేదు. కానీ..1939లో మొదటిసారి వాటిలో ఒకదాన్ని వాయించారు. అదే ఏడాది హోవార్డ్ చనిపోయాడు. అంతేకాదు.. అదే ఏడాది రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. వాటిని వాయించడం వల్లే యుద్ధం మొదలైందని చాలామంది నమ్మారు. దాంతో వాటిని ఎవరూ వాడకూడదని ఒక మ్యూజియంలో దాచారు. కొన్నేండ్లపాటు వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. 1967లో మ్యూజియంలో పనిచేసే వ్యక్తి ట్రంపెట్లను మళ్లీ వాయించాడు. వెంటనే ‘‘ఆరు రోజుల యుద్ధం’’ ఇజ్రాయెల్ – ఈజిప్ట్, జోర్డాన్, సిరియాల మధ్య జరిగింది.
ఈ యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.1990లో గల్ఫ్ యుద్ధం మొదలవ్వడానికి ముందు కూడా ట్రంపెట్స్లో ఒకదాన్ని వాయించారని చాలామంది నమ్ముతారు. చివరిసారిగా 2011లో ట్రంపెట్లలో ఒకదాన్ని వాయించిన సౌండ్ అక్కడివాళ్లకు వినిపించింది.
మ్యూజియంలో వస్తువులను శుభ్రం చేసే టైంలో సిబ్బందిలో ఒకరు దాన్ని వాయించారు. ఆ శబ్ధమే ఈజిప్టు విప్లవానికి వెల్‌కమ్ చెప్పింది. ఆ శబ్ధం వినిపించిన కొన్ని రోజుల్లోనే హోస్నీ ముబారక్‌పై ఈజిప్షియన్ తిరుగుబాటు జరిగింది. ఈ అల్లర్ల టైంలో ఆ ట్రంపెట్లలో ఒకదాన్ని దొంగిలించారు. న్యూస్ పేపర్లలో వాటి మాయాజాలం, శాపాల గురించి వార్తలు రావడంతో.. వాటిని కాజేసిన దొంగలు భయపడ్డారు.
దాంతో వాటిని ఒక బ్యాగ్‌లో పెట్టి, కైరో మెట్రోలో వదిలేసి వెళ్లారు. అలా ఆ ట్రంపెట్ వినిపించిన ప్రతిసారి ఏదో రకంగా యుద్ధం జరుగుతుంది. ఈజిప్షియన్లు ఇతర రాజులను యుద్ధాలకు ఆహ్వానించేందుకు ఈ ట్రంపెట్లను వాడి ఉంటారని, అందుకోసమే ప్రత్యేకంగా వీటిని తయారు చేశారని కొందరు నమ్ముతున్నారు. వాస్తవానికి యుద్ధాలన్నింటికీ కారణం ఈ ట్రంపెట్ల నుంచి వచ్చిన శబ్ధమేనా? లేక ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనలా? అనేది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది.