పారదర్శకత లేని మిషన్​ భగీరథ

 మిషన్​ భగీరథ ప్రాజెక్టు ద్వారా సరఫరా చేసే నీటి ఖర్చు ఎంత వస్తుంది? దీని గురించి ముందస్తు లెక్కలుకాని, అంచనాలుకాని చేయలేదు. ప్రతి ఇంటికి సరఫరా చేసే ప్రతి లీటర్ ఖర్చు ఎంత? సాధారణంగా ఇటువంటి అంచనాలు టెక్నో ఎకనామిక్  ఫీజిబిలిటి నివేదికలో ఉంటాయి. అటువంటి నివేదిక లేని పక్షంలో దాని గురించి తెలిసే అవకాశం లేదు. సాధారణంగా ‘ఎంత ఖర్చయినా’ అంటూ బీరాలు పలుకుతారు రాజకీయ నాయకులు. ప్రతి ఇంటికి సరఫరా చేసే నీటికి పెట్టే ఖర్చు ఎక్కడ నుంచి వస్తుంది? విద్యుత్​కు ఇచ్చినట్టు ప్రతి యేడు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ఇస్తుందా? వీటి మీద స్పష్టత లేదు. ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి విధి విధానాల పత్రం కూడా తయారు కాలేదు.

గతంలోనే గ్రామీణ రక్షిత నీటి పథకం ఉంది.

భగీరథ పథకంలో మూడు కీలక దశలు ఉంటాయి - మూల నీటి వనరు నుంచి నీటిశుద్ధీకరణ ప్లాంట్ వరకు తీసుకురావడం, నీటి శుద్ధీకరణ ప్లాంట్ నుంచి గ్రామం వరకు,  గ్రామంలో ఇంటింటికి ఉండే సరఫరా వ్యవస్థ. ఈ మూడు దశలలో కూడా అత్యంత ముఖ్యమైనది నీటి నిలువ సామర్థ్యం. వీటి మధ్య సారూప్యం కూడా ఉండాలే. లేకుంటే అనవసర ఖర్చులు పెరిగిపోతాయి.  మిషన్ భగీరథ వెబ్​సైట్​ ప్రకారం ఇప్పటి వరకు 37,002 రిజర్వాయర్లు ఆయా గ్రామాలూ, పట్టణాలలో కట్టారు. ఇందులో కొత్తవి ఎన్ని, పాతవి ఎన్ని అని చెప్పే విడి సమాచారం లేదు. ఈ పథకానికి ముందు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 21,910 గ్రామీణ రక్షిత నీటి పథకాలు ఉన్నాయి అని లెక్కలు చెబుతున్నాయి. ఉన్న వాటికి అదనంగా మిషన్ భగీరథ రాలేదు. వాటిని కలుపుకుని వచ్చింది. ఎక్కువ నీరు సరఫరా అవుతుంది అనే కారణంతో చాలా గ్రామాలలో ఉన్న పైపులైన్లు పీకేసి, కొత్త పెద్ద ప్లాస్టిక్ పైపులైన్లు వేశారు. పాతవి తీసి కొత్తవి వేస్తే పరిస్థితి మెరుగు అయ్యిందా? కొన్ని చోట్ల అయ్యి ఉండవచ్చు కానీ, అనేక చోట్ల రెంటికి చెడ్డ రేవడి అయ్యింది. 

పొంతన లేని లెక్కలు

ప్రభుత్వానికి అధికారులు తప్పుడు లెక్కలు ఇస్తున్నారు అని అప్పట్లో పత్రికలూ చెప్పాయి. ప్రభుత్వం కూడా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ పథకానికి పెట్టిన ఖర్చు ఎంత? ఒక్కొక్కసారి ఒక్కో లెక్క వస్తున్నది. ఇప్పుడు దాదాపు రూ.46,585 కోట్లు అంటున్నారు. తెచ్చిన అప్పులు, వడ్డీల భారం కలిపితే ఎంత అవుతుందో? నిర్వహణ ఖర్చుల లెక్క కూడా తేలలేదు. 2020లో 113 నీటి శుద్ధి ప్లాంట్ల నుంచి రోజుకు 4,109 మిలియన్ లీటర్ల  పంపింగ్ అవుతుందని ఒక పత్రికలో సమాచారం. లక్ష్యంగా పెట్టుకున్న 18,795 ఓహెచ్‌‌‌‌ఎస్‌‌ఆర్‌‌లలో 18,125 ఓవర్‌‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. ఇప్పుడేమో 37 వేల ట్యాంకులు కట్టామంటున్నారు. మిషన్ భగీరథ ద్వారా మొత్తం 55,26,343 ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తున్నారు అని అప్పటి లెక్క. ఇప్పుడేమో 65.29 లక్షల ఇండ్లకు (2.72 కోట్ల జనాభాకు) సరఫరా అవుతున్నది అంటున్నారు.

నీటి నాణ్యత

మిషన్ భగీరథ ద్వారా  సరఫరా చేస్తున్న నీటి నాణ్యత అనుమానాస్పదంగా ఉన్నది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, జుక్కల్, యల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ శాఖ నీటి నాణ్యత పరీక్షా కేంద్రాలు ఉన్నాయి అన్నారు. వీటి ద్వారా నిజామాబాద్‌‌, కామారెడ్డి జిల్లాల్లో రసాయన శాస్త్రవేత్తలు, మైక్రోబయాలజిస్టులు, ఫీల్డ్‌‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌‌ హెల్పర్‌‌ల బృందాలు ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను 13 రకాల పరీక్షలు నిర్వహిస్తాయి అని కూడా ప్రకటించారు.  భగీరథ శాఖా పరిధిలో ఎన్ని నీటి పరీక్షా కేంద్రాలు ఉన్నాయి, ఎప్పుడు నీటి నమూనాలు పరీక్షిస్తున్నారు, పరీక్షల సమాచారం ప్రజల ముందు పెట్టనపుడు ఈ ఖరీదైన నీటి మీద ప్రజలకు నమ్మకం పోయింది.123 నీటి శుద్ధి కేంద్రాల పనితీరు కూడా సమీక్ష చేయాల్సి ఉంది.  వీటి  పని తీరు బట్టి సరఫరా చేసే నీటి నాణ్యత ఉంటుంది. ప్రజల ప్రశ్న అప్పుడు ఇప్పుడు ఒకటే, మిషన్ భగీరథ నీటి నాణ్యత బాగుంటే జిల్లా ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలలో ప్యాకేజిడ్ బాటిల్ నీళ్ళు ఎందుకు తాగుతున్నారు?

ఇలాంటి ప్రాజెక్టులు దేశంలో సరిగా పనిచేయడం లేదు

స్థూలంగా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఒక తెల్ల ఏనుగు. మూల పెట్టుబడి ఎక్కువ. నిరంతర నిర్వహణ ఖర్చు కూడా భారమే. ఇటువంటి కేంద్రీ కృత పైపులైన్ ఆధారిత నీటి సరఫరా ప్రాజెక్టులు మన దేశంలో సరిగా పని చేయడం లేదు. ఇదివరకు సత్యసాయిబాబా అనంతపురంలో ఈ ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో పడే వర్షాన్ని సహజ, ప్రకృతి వ్యవస్థల ద్వారా నిలుపుకుని వాడుకునే వ్యవస్థల గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. తగిన విధానాలు తీసుకురావాలి.

విద్యుత్​ ఖర్చు ఎంత?

అవసరమైన విద్యుత్ 235 మెగావాట్లు అని చెబుతున్నారు. అనేక చోట్ల విద్యుత్ అవసరం లేకుండా వాలు బట్టి నీటి సరఫరా అవుతున్నది అని హామీ ఇచ్చినా చాలా గ్రామాలలో ప్రెషర్ లేదని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. విద్యుత్ ఖర్చు ఏటా ఎంత అనేది తెలియదు. దాదాపు రూ.300 కోట్లు విద్యుత్ ఏర్పాట్లకు నిధులు ఇచ్చారు. ఈ భారం ఇంకా పెరగవచ్చు. మిషన్ భగీరథ పైపులైన్లు పగిలిపోయి పంట పొలాల్లో వరదలు వచ్చి పంటలు కోల్పోయిన రైతులు ఉన్నారు. ప్రైవేటు భూముల ద్వారాపైపులైన్​లు, ప్రెషర్ వాల్వ్ పాయింట్లు పెట్టడానికి ఆఘమేఘాల మీద ‘రైట్ అఫ్ వే’ చట్టం తెచ్చింది అప్పటి ప్రభుత్వం. 

- డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​