ఎక్కడున్నావు అమ్మా..! క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‎కు వచ్చి తప్పిపోయిన తల్లి

తాడ్వాయి, వెలుగు: ఆలనా పాలన చూస్తుందనుకున్న తల్లి హైదరాబాద్‎లో తప్పిపోయి 20 రోజులు అవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో పిల్లలు అల్లాడుతున్నారు. అమ్మ జాడ దొరుకుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్‎కు చెందిన హిమాంబి(గాయత్రి) (35)కి ముగ్గురు ఆడ పిల్లలు. పిల్లల చిన్నతనంలోనే  భర్త పాము కాటుతో చనిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో హిమాంబి క్యాన్సర్ బారిన పడింది. 

చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‎లోని ఓ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమైంది. అయితే హిమాంబి సొంతూరికి రాకపోవడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు హిమాంబి ఆచూకీ దొరకలేదు. ఎక్కడున్నావు అమ్మా..! అంటూ పిల్లలు విలపిస్తున్నారు. తమ అమ్మ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే  703647957,6304951655 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.