వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయంలో హుండీల్లో డబ్బులు దొంగతనం చేస్తున్న మైనర్లను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గర్భాలయ ఆవరణలోని ఆలయ హుండీలు నిండిపోవడంతో డబ్బులు పైకి కనపడకుండా వస్త్రం కట్టారు. కానీ సాధారణ భక్తుల లాగా ముగ్గురు మైనర్లు, ఎవరికి అనుమానం రాకుండా చేతివాటం ప్రదర్శించారు.
ఆలయంలోకి వచ్చి హుండీల దగ్గరే ఎక్కువ సమయం ఉండడంతో రాజన్న గర్భాలయంలో ఆలయ సిబ్బంది పట్టుకొని పోలీసులకి అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.4000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురు మైనర్లకు 12 నుంచి 14 యేళ్ల లోపు ఉంటాయన్నారు. వారిని విచారిస్తున్నట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఆలయంలో ఎస్పీఎఫ్ భద్రత వైఫల్యం విమర్శలు వస్తున్నాయి.