సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపు రూ.7 వేల 5 వందల కోట్లు ఖర్చు పెడితే.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లే రాలేదన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జనవరి 26వ తేదీ శుక్రవారం సూర్యపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో గంధాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మత సామరస్యంగా ప్రతీక నిలిచిన జాన్ పహాడ్ దర్గాలో జరుగుతున్న ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడి మంచి పంటలు పండి.. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
తాను గతంలో ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో రోడ్లు, మంచినీరు సౌకర్యాలు కలిపించానని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్భాటాలు తప్ప అభివృద్ధి ఏమి జరగలేదని విమర్శించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా.. అన్ని సౌకర్యాలు కోసం కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా 40 వేల కోట్ల రూపాయలతో అప్పు చేసి.. కృష్ణ నది ఒడ్డున ఉన్న గ్రామాలకు నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వకపోగ.. 90 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని తెలిపారు. తాగు నీటి కోసం సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.