అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముత్యాల బ్రాంచ్ కెనాల్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కొత్త పైపులైన్స్, పంప్ హౌస్  పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

నవోదయ స్కూల్ కోసం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం మఠంపల్లి మండలంలో సుమారుగా 100 ఎకరాలు భూమిని గుర్తించామని, మంగళవారం స్థల పరిశీలనకు టీంను పంపుతామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం మ్యాపింగ్, ఆర్కిటెక్ వంటి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

అనంతరం ఆర్ అండ్ బీ ఈఈ సీతారామయ్య మాట్లాడుతూ హుజూర్​నగర్ నియోజకవర్గంలో 10, కోదాడలో 6 చోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న పెద్దగట్టు జాతరకు చేపడుతున్న ఏర్పాట్లపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ రాంబాబు, ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.