కాసుల కక్కుర్తి కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ : ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

  • బీఆర్ఎస్ సర్కార్​పై ఇరిగేషన్ ​మంత్రి ఉత్తమ్ ఫైర్
  • రాజీవ్, ఇందిరా సాగర్​లను మార్చి సీతారామ ప్రాజెక్టు కట్టారు ​
  • రూ.3,500 కోట్లతోనే పూర్తయ్యేదాన్ని.. రూ.18,286 కోట్లకు పెంచారు
  • ప్రాజెక్టుకు కనీసం సీడబ్ల్యూసీ అనుమతులూ తీసుకురాలేదని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: కాసుల కక్కుర్తి కోసమే గత బీఆర్ఎస్​సర్కారు​ప్రాజెక్టులను రీ డిజైన్​ చేసిందని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్ట్​కూడా రీ డిజైన్​ చేసిందేనన్నారు. వైఎస్సార్​ హయాంలో రూ.3,505 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్​సాగర్​దుమ్ముగూడెం, ఇందిరా సాగర్​ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీములను చేపట్టారని.. అవి పూర్తయితే కాంగ్రెస్​కు పేరొస్తుందన్న ఉద్దేశంతో సీతారామ లిఫ్ట్​ఇరిగేషన్​ పేరిట ప్రాజెక్టును రీడిజైన్​ చేశారని విమర్శించారు. అంచనా వ్యయాన్ని ఒక్కసారిగా రూ.18,286 కోట్లకు పెంచారని అన్నారు. 

అంతేకాకుండా ఆయకట్టును 4 లక్షల ఎకరాల నుంచి 3.29 లక్షలకు తగ్గించేశారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి జలసౌధలో మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుకు తొలుత రూ.7,900 కోట్లకే పరిపాలనా అనుమతులు ఇచ్చారని,  ఆ తర్వాత ఒకసారి రూ.13 వేల కోట్లు, మరోసారి రూ.18,286 కోట్లకు పెంచారని.. బీఆర్ఎస్​ పాలకుల కాసుల కక్కుర్తికి ఇదే నిదర్శనమని మంత్రి విమర్శించారు. వాళ్లు దిగిపోయే నాటికి ప్రాజెక్టుకు చేసిన ఖర్చు కేవలం రూ.7,436 కోట్లేనని, మొత్తం అంచనా వ్యయంలో అది కేవలం 39 శాతమేనని అన్నారు. 

అలాంటది బీఆర్ఎస్​హయాంలోనే ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని హరీశ్​ రావు ఎలా అంటారని నిలదీశారు. రాజీవ్​సాగర్​, ఇందిరాసాగర్​ స్కీములకు అప్పట్లోనే రూ.1,948 కోట్ల విలువైన పనులు చేశారని, మరో రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్తయి 4 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవని మంత్రి ఉత్తమ్​ గుర్తుచేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్​ హయాంలోనే సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయని హరీశ్​ రావు పచ్చి అబద్ధాలు చెప్పారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక తనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​ రావు, అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లి ఈ ఏడాది జనవరి 5న సీడబ్ల్యూసీ అనుమతులు తెచ్చుకున్నామని చెప్పారు. 

గత ప్రభుత్వం కాస్ట్​ బెనిఫిట్​ రేషియోనూ పట్టించుకోలేదన్నారు. జీఆర్​ఎంబీ నుంచి ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చాయన్నారు. ప్రాజెక్టుకు 67 టీఎంసీల జలాల కేటాయింపులు చేయించామని, అది తమ కాంగ్రెస్​ ప్రభుత్వ ఘనతేనని ఉత్తమ్​స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు నీళ్లు తరలించింది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని.. కానీ, అధికారంలోకి వచ్చిన నెలకే ఆ నీళ్లను కేటీఆర్​ నెత్తిన చల్లుకుని సిటీ అంతటా హోర్డింగ్స్​పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 

వాళ్లు పూర్తి చేసింది పంప్​హౌస్​లే

బీఆర్ఎస్​ హయాంలో సీతారామ ప్రాజెక్టులో పూర్తి చేసింది కేవలం పంప్​హౌస్​లేనని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. వాటిని కూడా కమీషన్లు వస్తాయనే పూర్తి చేశారని విమర్శించారు. అయితే, వాటికి కనీసం కరెంట్​ కనెక్షన్​ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తమ హయాంలోనే అన్ని ప్యాకేజీల పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాకా ప్యాకేజీ 1 నుంచి ప్యాకేజీ 5 వరకు పనులను పూర్తి చేశామన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు. బీఆర్ఎస్​ హయాంలో ఇరిగేషన్​ను సర్వనాశనం చేస్తే.. తాము సిస్టమాటిక్​గా ముందుకెళుతూ బాగుచేస్తున్నామన్నారు.

 కాళేశ్వరానికి రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకే నీళ్లిచ్చారన్నారు. సీతారామకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదని మండిపడ్డారు. ఎస్​ఎల్​బీఎసీ, డిండి, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను మూలకు పడేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన నష్టం కూడా తీవ్రంగానే ఉందని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. 

అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లోనూ సీకెంట్​ పైల్స్​లో తీవ్రమైన సమస్యలున్నాయంటూ ఎన్​డీఎస్​ఏ తమకు చెప్పిందని పేర్కొన్నారు. బ్యారేజీల విషయంలో కేసీఆరే అన్నీ చేశారన్నారు. డిజైన్ల నుంచి నిర్మాణం వరకు ఇంజినీర్లు చేయాల్సిన పనిని ఆయనే చేశారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కింద భారీ గొయ్యి పడితే గ్రౌటింగ్​ చేయడమూ కష్టంగా మారిందని గుర్తు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు రిటెయినింగ్​ వాల్​ కూలిన ఘటనలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్​చర్యలు తప్పవన్నారు.

మోటార్లు పెట్టి కనీసం డ్రైరన్​ కూడా చేయలే: పొంగులేటి

సీతారామ ప్రాజెక్టులో బీఆర్ఎస్​ వాళ్లు పంప్​హౌస్​లు పెట్టి, మోటార్లు బిగించి వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. కమీషన్లు రావన్న ఉద్దేశంతో కనీసం ఆ మోటార్ల డ్రైరన్​ కూడా చేయలేదన్నారు. మిషన్​ కాకతీయతో 35 వేల చెరువుల్లోని చెట్లను కొట్టేసి.. ఆ చెరువులను వాళ్లే కట్టినట్టుగా చెప్పుకున్నారన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతానికి గోదావరి నీళ్లను తామే తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలొచ్చినప్పుడే వారికి డబుల్​ బెడ్రూం ఇండ్లు గుర్తొచ్చేవన్నారు. 

గతంలో కాంగ్రెస్​ హయాంలో 18 లక్షల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల కింద కట్టిస్తే.. బీఆర్ఎస్​ హయాంలో ఇచ్చింది కేవలం 1.38 లక్షలేనన్నారు. తమ ప్రభుత్వం మాట మీద నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం ప్రజల పౌరుషమేంటో హరీశ్​ రావు తన మామను అడిగి తెలుసుకుంటే మంచిదన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్​ గెలిచింది ఒక్క సీటు మాత్రమేనన్నారు. ఖమ్మం ప్రజలను ఎంత తక్కువ గోకితే హరీశ్​రావుకు అంత మంచిదన్నారు.