విద్యారంగ అభివృద్ధికి పటిష్ట చర్యలు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • రఘునాథపాలెం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం
  • జింకల తండా వద్ద ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’​కు శంకుస్థాపన 

ఖమ్మం టౌన్, వెలుగు : విద్య ప్రాధాన్యత అంశంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని, పేద ప్రజలకు ప్రపంచంతో పోటీపడే విద్య అందే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులకు ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ సమాజానికి కావాల్సిన అత్యంత ప్రాధాన్యత అంశం విద్య అని,  నైపుణ్యం కలిగిన టీచర్లతో విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

రఘునాథపాలెం గుట్టల్లో ఉన్న మట్టిని దొంగలు దోచుకెళ్లడంతో,ఇప్పుడు ఆ గుంతలు పూడ్చి రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మించడం డబుల్ పని అవుతోందన్నారు. ఎంత కష్టమైనా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా స్వామి నారాయణ ట్రస్ట్ కు భిన్నంగా నిరుపేద స్టూడెంట్స్ ను తయారు చేయాలనే లక్ష్యంతో ఇక్కడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని పట్టుదలతో శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా రఘునాథ పాలెం మండలాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.  గతంలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో అరకొర వసతులతో పిల్లలు ఇబ్బంది పడ్డారని, ఆ పరిస్థితి మళ్లీ రావద్దని ఒక్కో పాఠశాలకు రూ.300 కోట్ల  నుంచి రూ.350 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను నిర్మిస్తున్నామని చెప్పారు. 

మండలంలో ప్రభుత్వ భూములు మార్క్ చేసి పెట్టుకోవాలని, ఇస్కాన్ పాఠశాల, కిచెన్, కృష్ణ దేవాలయం  ఏర్పాటు అవుతాయని కలెక్టర్ కు సూచించారు. పిల్లలు చిన్న వయసులోనే గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలను కనిపెట్టుకొని ఉండాలన్నారు. బుగ్గవాగు నీళ్లు ఈ మండలానికి తేవడానికి కాల్వల కోసం భూములు ఇస్తే తీసుకొని వస్తానని, లేకపోతే సాగర్ లిఫ్ట్ ద్వారా ఈ మండలానికి నీళ్ళు తెస్తానని చెప్పారు.  మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలో ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామన్నారు. వైద్య కళాశాలలో భూమి కోల్పోయిన రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. 

ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ..

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రుణ మాఫీ చేశామని మంత్రి తెలిపారు. 2 లక్షల పైన ఉన్న రుణాల  రైతులకు షెడ్యూల్ ప్రకటించి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పారు. సన్నాలు పండించే రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ప్రకటించామన్నారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు దోహద పడతాయన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు కలిపి నాణ్యమైన విద్యతోపాటు అద్భుతమైన మౌలిక వసతులు, క్రీడా వసతులు, మంచి పౌష్టికాహారం అందించే దిశగా కృషి చేస్తామని తెలిఆపరు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల ద్వారా అన్ని కులాలు, మతాల వారు కలిసి ఒకేచోట చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, నగర కార్పొరేటర్ కమర్తపు మురళి, అధికారులు,  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

 కల్లూరులో అమ్మవారికి పూజలు 

కల్లూరు :  కల్లూరు పట్టణంలోని పుల్లయ్య బంజారాలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవిలతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారిని దేవి నవరాత్రి ఉత్సవ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవీ నవరాత్రి ఉత్సవాల నిర్వాహక కమిటీ సభ్యులు చిత్తులూరి నరేశ్, వేముల శ్రీనివాస్, సముద్రాల పుల్లారావు, చారు గుండ్ల శ్రీలక్ష్మి, గౌరవరపు కనకదుర్గ, చారు గుండ్ల నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.