ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న బీఆర్ఎస్

  • మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి, సీతక్క
  • కాంగ్రెస్ ​భూములు పంచితే.. బీఆర్ఎస్​ లాక్కని అమ్ముకున్నది
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 
  • యాదగిరిగుట్టలో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ అబద్ధాలతో అధికారంలోకి రావాలని చూస్తుందని విమర్శించారు. శుక్రవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మంత్రులు మిషన్​భగీరథ పైలాన్ ను ఆవిష్కరిం చారు. 

 అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్​హయాంలో పేదలకు భూములు పంచితే.. బీఆర్ఎస్​ పాలనలో లాక్కుని అమ్ముకున్నదని ఆరోపించారు. కొమురవెల్లి మల్లన్నసాగర్​నుంచి పైపులైన్​ ద్వారా నీటిని అందించడానికి రూ. 210 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పనులు పూర్తయితే ఆలేరు, భువనగిరి, జనగామ నియోజక వర్గాల్లోని 523 గ్రామాలకు తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 

మేడిగడ్డ లెక్కనే కూలిన బీఆర్ఎస్.. మంత్రి కోమటిరెడ్డి  

మేడిగడ్డ తరహాలోనే బీఆర్ఎస్​ పేక మేడలా కూలిపోయిందని ఆర్అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీ పనైపోయిందన్నారు. బీఆర్ఎస్​హయాంలో దోచుకున్న సొమ్ముకు తమ ప్రభుత్వం వడ్డి కడుతోందన్నారు.

గంధమల్ల రిజర్వాయర్​కు నెల రోజుల్లో టెండర్లు పిలుస్తామన్నారు. వెనుకబడిన ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్కను కోరారు. కార్యక్రమంలో యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి పాల్గొన్నారు.