రైతన్న, నేతన్నలను కాపాడుకుంటం : తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు

  • రూ.2 లక్షలకుపైగా ఉన్న లోన్లను సైతం మాఫీ చేస్తాం

యాదాద్రి, వెలుగు : ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా రైతులు, నేతన్నలను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రూ. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా ఈ వానాకాలంలోనే మాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం కష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిందని, అయినా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో ఆదివారం నిర్వహించిన అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి తుమ్మల హాజరయ్యారు. .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు విత్తనాలు, మందులకు ఎగ్గొట్టిన సొమ్ము కూడా తామే చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఏకష్టం రాకుండా చూసుకుంటామని, గతంలో వ్యవసాయరంగానికి అందించిన స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గం కోసం చేపట్టే సాగునీటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. ఆలేరు మార్కెట్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన గోడౌన్స్‌‌‌‌‌‌‌‌ను మంజూరు చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

తాగు, సాగు నీటి సరఫరాతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పదవులను బాధ్యతగా భావించినప్పుడే ప్రజలకు సేవ చేయగలుగుతారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కోసం కోమటిరెట్టి పనిచేస్తున్నారని, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ మంత్రి అయినప్పటికీ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మంత్రిలా ఆలోచిస్తూ పనులు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ చైతన్య మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పచ్చిమట్ల మదార్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు..

ఆలేరు సమస్యలు పరిష్కరిస్తా : మంత్రి కోమటిరెడ్డి

ఆలేరు నియోజకవర్గం అంటే తనకు ఎంతో అభిమానమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోయిందన్నారు. తనకు పేరొస్తుందన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ సొరంగం పనులను పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.