యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు బుధవారం దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయంలో లక్ష్మీనారసింహులకు నిర్వహించిన నిజాభిషేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భగుడిలో నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శనం కల్పించారు.

అనంతరం ముఖ మంటపంలో మంత్రికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. స్వామివారి దర్శనం కోసం మంగళవారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చిన మంత్రి మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బొకేలు ఇచ్చి శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు.

ప్రెసిడెన్షియల్ సూట్ లో నిద్ర చేసిన మంత్రి బుధవారం ఉదయం స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేశ్​యాదవ్, టౌన్ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, మండల నాయకుడు ఎరుకల హేమేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.