ఇకనైనా పద్దతి మార్చుకోండి.. BRS నేతలకు మంత్రి సీతక్క మాస్ వార్నింగ్

కరీంనగర్: సహచర మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్‎పై మంత్రి సీతక్క రియాక్ట్ అయ్యారు. కరీంనగర్‎లో ఇవాళ (సెప్టెంబర్ 30) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేస్తోన్న బీఆర్ఎస్ పార్టీ ట్రోలర్స్‎పై నిప్పులు చెరిగారు. స‌హ‌చ‌ర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ రఘునందన్ రావు నూలు దండ వేస్తే దాన్ని వ‌క్రీక‌రించి సోషల్ మీడియాలో దారుణంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‎కు మ‌హిళ‌లు అంటే చుల‌క‌నని అందుకే ట్రోల్ చేస్తారని ధ్వజమెత్తారు. మ‌హిళా మంత్రుల‌ను, మ‌హిళా నేత‌లు వెంట‌ప‌డి మ‌రీ బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వేధిస్తుందని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్ అని సీతక్క విరుచుకుపడ్డారు.

మ‌హిళా మంత్రిగా నేను, సోద‌ర మంత్రి పొన్నం ప‌విత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన ఫోటోల‌ను కూడా మార్ఫింగ్ చేసి దుర్మారంగా వ్యవ‌హ‌రించారని ఫైర్ అయ్యారు.  సీఎం కుటుంబాన్ని, వారి పిల్లల్ని వేధిస్తున్న మీరు మ‌నుషులేనా అని విమర్శించిన సీతక్క.. మీ ఇంట్లో మ‌హిళ‌లు ఏ వ్యాపారాలు చేశారో దేశానికి తెలుసని.. అయినా ఆడ‌కూతురు అన్న కార‌ణంతో మేము ఏనాడు చెడుగా స్పందించ లేదన్నారు. దొర ఆహ‌కారంతోనే బీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల‌ను టార్గెట్ చేస్తుందోని.. రాజ‌కీయాల్లో, ప్రజా జీవితంలో క్రియా శీల‌కంగా ప‌నిచేసే వారిపై బుర‌ద చ‌ల్లుతున్నారని మండిపడ్డారు.

ALSO READ | విమర్శలకు హద్దులుండాలి.. పొన్నం ప్రభాకర్

ఎన్నో క‌ష్ట న‌ష్టాలు అధిగ‌మించి రాజ‌కీయాల్లో ఎదిగొచ్చిన మ‌హిళా నేత‌ల‌పై త‌ప్పుడు ప్రచారాలా..? ఈ ర‌కంగా దుష్ప్రచారం చేస్తే మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి రాగ‌లుగుతారా అని ప్రశ్నించారు. ఆడ కూతుర్లను అత్యంత అవ‌మాన‌క‌రంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు మళ్లీ వెన‌క్కు నెడుతున్నారని.. మ‌ళ్లీ దొర‌ల రాజ్యం తెవాల‌న్న త‌లంపుతోనే సోష‌ల్ మీడియా ద్వారా మ‌హిళా నేత‌ల‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీ ఫ్యూడ‌ల్ మెంటాలిటికి, పితృ స్వామ్య భావ‌జాలానికి నిద‌ర్శనమని విమర్శించారు.

మొన్న మేయర్ విజ‌య ల‌క్ష్మీ, నిన్న నాపై, నేడు కొండా సురేఖ‌పై త‌ప్పుడు ప్రచారం చేస్తూ మ‌హిళా నాయ‌క‌త్వాన్ని బీఆర్ఎస్ వెనక్కి నెడుతోందని.. అసలు మహిళలు రాజకీయాల్లో రావాలా వద్ద అనేది బీఆర్ఎస్ స్పష్టం చేయాలని ఈ సందర్భంగా సీతక్క డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీకారు నాయ‌కులారా ఇకనైనా ప‌ద్దతి మార్చుకోండని సీతక్క మాస్ వార్నింగ్ ఇచ్చారు. దుర్మార్గపు ఆలోచ‌న‌లు మానుకుని బుద్ది తెచ్చుకోండని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ త‌క్షణమే క్షమాప‌ణ‌లు చెప్పి.. త‌మ సోష‌ల్ మీడియాను క‌ట్టడి చేయాలని సీతక్క డిమాండ్ చేశారు.