బీఆర్‌ఎస్‌లో అన్ని పదవులు మీకేనా.. బీసీలకు ఒకటైనా ఇవ్వరా ?: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ సిటీ, వెలుగు: ‘బీఆర్‌‌ఎస్‌‌ అధ్యక్షుడు, వర్కింగ్‌‌ ప్రెసిడెంట్, శాసనసభా ప్రతిపక్ష నేత పదవులన్నీ మీ కుటుంబ సభ్యుకేనా ? బీసీలకు కూడా ఒక పదవి ఇవ్వండి’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ డిమాండ్‌‌ చేశారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని సవాల్‌‌ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో శనివారం కరీంనగర్‌‌ డీసీసీ ఆఫీస్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో మంత్రి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీనే ఐదేండ్లు చేసిందని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్‌‌ ప్రభుత్వానిదేనన్నారు. సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ సత్తు మల్లేశం, మాజీఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కరీంనగర్, హుజురాబాద్‌‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌‌ పార్టీ ఇన్‌‌చార్జులు పురుమల్ల శ్రీనివాస్‌‌, ఒడితల ప్రణవ్‌‌బాబు, డీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కోమటిరెడ్డి పద్మాకర్‌‌రెడ్డి పాల్గొన్నారు.