వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

  • పార్టీలకు అతీతంగా సమస్యలను పరిష్కరిస్త
  • సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇండ్లు 
  • హుస్నాబాద్​లో  మంత్రి  పొన్నం మార్నింగ్​వాక్​
  • స్థానికులతో మాట్లాడి సమస్యలపై ఆరా 

‘ హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, మోడల్​నియోజకవర్గంగా తీర్చిదిద్దుత..  దశలవారీగా సమస్యలను పరిష్కరిస్త..  స్థానికులకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ.. ఇక్కడ గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా... పార్టీలకు అతీతంగా ఎలాంటి సమస్యలున్న పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటా.. కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది.   సంక్రాంతి నుంచి ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణం స్టార్​చేస్తుంది.  వచ్చే నాలుగేండ్లలో  రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తం. దీనికి సంబంధించి  నిరుపేదల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు  యాప్​లో ఏంట్రీ చేశారు. సర్వే ప్రక్రియ జరుగుతుంది.  ’ అని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు. 

ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్​లో మంత్రి పొన్నం ప్రభాకర్​ మార్నింగ్​ వాక్​ చేశాడు.  పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ.. స్థానికులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  పలు సమస్యలపై  అప్పటికప్పుడే అధికారులతో ఫోన్​లో మాట్లాడి పరిష్కరించారు.  పట్టణంలోని  ప్రధాన రోడ్డు నిర్మాణపు పనులను పరిశీలించారు.  పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.  కూరగాయలు అమ్మే మహిళలతో ముచ్చటించారు.  వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయని ఆరా తీశారు.  

అనంతరం హుస్నాబాద్​టౌన్​లో రెనోవేశన్​అవుతున్న బస్​స్టాఫ్​ను ఆయన పరిశీలించారు.  ఈ మేరకు అధికారులకు పలు సూచనలు చేశారు.  ఆధునాతన సౌకర్యాలతో, సకల హాంగులతో నిర్మాణం చేపట్టాలన్నారు.  పెండింగ్​పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.  త్వరలోనే  ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకురావాలన్నారు. బస్ స్టాండ్ లో ప్రయాణికులతో మాట్లాడగా.. పలువురు కొత్త రూట్లలో బస్సులు కల్పించాలని  మంత్రిని కోరారు.. త్వరలోనే మరిన్ని  బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.