బీఆర్‌ఎస్‌‌ హయాంలో..మెస్‌‌ చార్జీలు పెంచలే: మంత్రి పొన్నం ప్రభాకర్

  • బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌

కరీంనగర్, వెలుగు:పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో స్టూడెంట్ల మెస్‌‌ చార్జీలు పెంచలేదని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ విమర్శించారు. మెస్‌‌, కాస్మొటిక్‌‌ చార్జీలు పెంచిన సీఎం రేవంత్‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు చెప్పారు. 

కరీంనగర్‌‌ శర్మనగర్‌‌లోని బీసీ గురుకుల హాస్టల్‌‌ స్టూడెంట్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ దీపావళి వేడుకలు నిర్వహించారు. 

డైట్, కాస్మొటిక్‌‌ చార్జీల పెంపును హర్షిస్తూ కేక్‌‌ కట్‌‌ చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మూడో తరగతి నుంచి ఏడో తరగతి స్టూడెంట్ల మెస్‌‌ చార్జీలను రూ.950 నుంచి రూ.1,330కి, 8 నుంచి టెన్త్ వరకు రూ.1,100 నుంచి రూ.1,540కు, ఇంటర్‌‌ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి రూ. 2,100కు పెంచినట్లు వివరించారు.

 అలాగే మొత్తం 1,020 గురుకులాల్లో 320 మాత్రమే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయని, మిగతావి అద్దె భవనాల్లోనే ఉన్నాయన్నారు. రెంట్‌‌ కోసం ఇప్పటికే రూ.100 కోట్లు రిలీజ్‌‌ చేశామని గుర్తు చేశారు. 

అలాగే శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాలతో మంత్రి పొన్నం భేటి అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నపూర్ణ కాంప్లెక్స్‌‌లో సౌకర్యాలు, వ్యాపార కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ట్రాఫిక్‌‌ సమస్యలపై చర్చించారు. 

వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.