గేట్ వే ఆఫ్ వరంగల్ గా ఎల్కతుర్తి..​!

  • సిద్దిపేట, కరీంనగర్ రూట్ లో కీలక జంక్షన్
  • మంత్రి పొన్నం చొరవతో అభివృద్ధికి అడుగులు
  • ఇప్పటికే కుడా నుంచి రూ.1.5 కోట్లు కేటాయింపు
  • మరో రూ.2 కోట్లతో బస్టాండ్ కాంప్లెక్స్ కు ప్లాన్ రెడీ చేస్తున్న అధికారులు

హనుమకొండ/ ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి.. కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి హనుమకొండ, వరంగల్ నగరాలకు వచ్చే వాహనాలకు స్వాగతం పలికే కీలకమైన జంక్షన్. ఎన్​హెచ్​-563పై గేట్ వే ఆఫ్ వరంగల్ గా ఉన్న ఎల్కతుర్తి ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైంది. గత పాలకులు పట్టించుకోకపోవడంతో కనీస డెవలప్ మెంట్ కు నోచుకోలేదు.

 దీంతో ఈ జంక్షన్ కాస్త డేంజర్ జోన్ గా మారి.. అడపాదడపా ప్రమాదాలు కూడా చోటుచేసుకునేవి. ఈ నేపథ్యంలో స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్​ ఎల్కతుర్తి జంక్షన్ ప్రాధాన్యాన్ని గుర్తించి, డెవలప్ మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గేట్ వే ఆఫ్ వరంగల్ గా, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు వారధిగా పేరున్న ఎల్కతుర్తికి అభివృద్ధి బాటలు వేస్తున్నారు. 

కుడా ఫండ్స్ తో డెవలప్ మెంట్..

ఓ వైపు హనుమకొండ, మరోవైపు కరీంనగర్, ఇంకో వైపు సిద్దిపేట.. ఇలా మూడు జిల్లాల వై జంక్షన్ గా ఉన్న ఎల్కతుర్తి డెవలప్ మెంట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధికి ప్లాన్ రెడీ చేయాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

ఎన్ హెచ్​-765 డీజీ సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే, మరోవైపు ఎన్​హెచ్​-563 ఫోర్ లేన్ పనులు జరుగుతుండటంతో ఎల్కతుర్తి జంక్షన్ డెవలప్ మెంట్ అంశం కీలకంగా మారింది. దీంతోనే మంత్రి పొన్నం మొదట ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధిపై ఫోకస్​ పెట్టారు. ఇప్పటికే రెండు సార్లు ఆ జంక్షన్ ను హనుమకొండ కలెక్టర్, కుడా, ఆర్అండ్ బీ, ఆర్టీసీ ఆఫీసర్లతో కలిసి విజిట్ చేశారు. అనంతరం కుడా నుంచి రూ.1.5 కోట్లు కూడా మంజూరు చేయించారు. ఈ మేరకు కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి సంబంధిత నిధులు కూడా విడుదల చేయగా, జంక్షన్​మోడల్ ఫైనల్ చేసి తొందర్లోనే పనులు స్టార్ట్ చేసేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు.

తొందర్లోనే బస్టాండ్ కాంప్లెక్స్..

కరీంనగర్​-వరంగల్ హైవే, ఎల్కతుర్తి-సిద్దిపేట హైవేలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఎల్కతుర్తి బస్టాండ్ ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం నాలుగు ప్లాట్ ఫామ్ లతోనే బస్టాండ్ ఉండగా, హైవేలు విస్తరించి, రవాణా సౌకర్యం మెరుగైన తర్వాత ఇక్కడ మరింత రష్ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మంత్రి పొన్నం ఆదేశాల మేరకు ఇక్కడ బస్టాండ్ కాంప్లెక్స్ డెవలప్ మెంట్ కు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ఈ మేరకు బస్టాండ్ లో వివిధ షాప్స్, ఇతర ఫెసిలిటీస్ కల్పించేందుకు దాదాపు రూ.2 కోట్ల అంచనాతో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో తొందర్లోనే ఎల్కతుర్తి గేట్ వే ఆఫ్ గా వరంగల్ మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉందని, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.