ఎంఎస్ఎంఈ పాలసీలోకి కులవృత్తులు

  • 2 లక్షల మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేస్తాం
  • మానేరు రివర్  ఫ్రంట్  అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
  • మంత్రి పొన్నం ప్రభాకర్
  • కరీంనగర్ లో సేఫ్టీ మోకులు పంపిణీ

కరీంనగర్, వెలుగు : ఎంఎస్ఎంఈ పాలసీలో కుల వృత్తులను చేరుస్తామని, కొన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రిజిస్టర్  అయిన 2 లక్షల మంది గీత కార్మికులకు  కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని, మొదటి దశలో హైదరాబాద్  మినహా 100 నియోజకవర్గాల్లో 10 వేల కిట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్  సిటీలోని రామగుండం బైపాస్  రోడ్​లోని రేణుకా ఎల్లమ్మ ఆలయం ఫంక్షన్ హాల్ లో గురువారం కాటమయ్య రక్షణ కవచం కిట్ల(సేఫ్టీ మోకుల)ను మంత్రి పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు చెట్టుపై నుంచి పడకుండా ఈ సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని.. శుక్రవారం హుస్నాబాద్, ధర్మపురి, మానకొండూర్, మంథనిలో యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో పాఠశాలకు రూ.180 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వసతి గృహాలను, గురుకులాలను అధికారులు సందర్శించి విద్యార్థులకు సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని ఆదేశించారు. 

మానేరు రివర్  ఫ్రంట్  అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఇక్కడ ఉన్న డంప్  యార్డును తరలించాలని కలెక్టర్ కు సూచించారు. అనంతరం సేఫ్టీ మోకు పని తీరుపై ట్రైనర్  గీత కార్మికులకు చెట్టు ఎక్కి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి , ఆర్డీవో మహేశ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్  ఐలేందర్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.