కరీంనగర్ లో రాహుల్ సభ జరిగి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవి : పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి అధికంగా సీట్లు గెలుచుకోవడం సంతోషకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి డీసీసీ భవన్​లో మాట్లాడారు. రాజేందర్ రావుకు 3 లక్షల 54 వేల ఓట్లు రావడం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక ప్రశంసగా భావిస్తున్నామన్నారు. 

రాహుల్ గాంధీ సభ కోసం కరీంనగర్​లో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా నిర్వహించలేకపోయామని, ఆ సభ జరిగి ఉంటే తమకు ఇంకా మంచి ఫలితాలు వచ్చేవన్నారు. ‘ఇప్పటికైనా మతపరమైన విద్వేషాలకు కరీంనగర్ ను వేదిక చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని బండి సంజయ్​ని కోరుతున్నాం. సంజయ్ కరీంనగర్​కు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి’ అని అన్నారు. 

స్థానికేతరుడైన వినోద్ కుమార్ పీడ ఈ నియోజకవర్గానికి విరగడైందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందరావు మాట్లాడుతూ అభ్యర్థిగా తనను ప్రకటించడంలో ఆలస్యం జరగడం, ప్రచారానికి 15 రోజుల గడువు మాత్రమే ఉండడం, ఇతర కారణాలతో ఓడిపోయానన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ లీడర్లు పురుమల్ల శ్రీనివాస్, ప్రణవ్ బాబు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు.