గండిని స్పీడ్​గా పూడ్చాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

  • పాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనుల పరిశీలన 
  • షిఫ్టులవారీగా 24 గంటల పాటు పనులు చేయాలని ఆదేశం 

కూసుమంచి, వెలుగు :--పాలేరు ఎడమ కాల్వ గండి పూడ్చేందుకు జరుగుతున్న  పనులను స్పీడప్​ చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న  పనులను ఆయన పరిశీలించారు. కాల్వ గండి పూడ్చివేత, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వత పునరుద్ధరణ పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

షిఫ్టులవారీగా గండి పూడ్చివేత పనులు 24 గంటల పాటు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ విద్యాసాగర్, ఎస్ఈ నర్సింగరావు, ఈఈలు మంగళంపూడి వెంకటేశ్వర్లు, అనన్య, డీఈ రమేశ్​రెడ్డి నాయకులు బజ్జూరి వెంకటరెడ్డి, రవికుమార్, మాజీ సర్పంచ్​ సూర్యనారాయణరెడ్డి, జీవన్​రెడ్డి పాల్గొన్నారు.

పీఎస్​ఆర్​ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయం

తిరుమలాయపాలెం మండలంలో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికీ సాయం అందజేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆదివారం పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి, జూపేడ, బంధంపల్లి, తిప్పారెడ్డిగూడెం, రాకాసి తండా గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా శివరామకృష్ణ, రామసహాయం నరేశ్​రెడ్డి, మద్దులపల్లి రైతు మార్కెట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నిమజ్జన సమయంలో అలర్ట్​గా ఉండాలి


ఖమ్మం, వెలుగు : వినాయక నిమజ్జన సమయంలో యువత అలర్ట్​గా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను ఆదివారం ఆయన దర్శించుకొని పూజలు చేశారు. గొల్లగూడెం రోడ్ లోని శ్రీ సత్యసాయి నగర్, శ్రీనివాస్ నగర్, ముస్తఫా నగర్, విద్యా నగర్, టీడీపీ కార్యాలయం రోడ్, వీడీవోస్​ కాలనీ, ఎఫ్ సీఐ గోడౌన్, ఖమ్మం రూరల్ లోని పెద్ద తండా, శ్రీరామ్ నగర్ కాలనీ లోని మండపాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయక నిమజ్జనాన్ని అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.  నిమజ్జన సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల నరేందర్, రాపర్తి శరత్, దొడ్డా నగేశ్, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య,  కొప్పుల చంద్ర శేఖర్  పాల్గొన్నారు.