కేసీఆర్‎కు రైతు భరోసా ఇస్తం: మంత్రి పొంగులేటి

వరంగల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎కు కూడా రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు, భూ నిపుణలు, మేధావుల నుండి సలహాలు స్వీకరించిన తర్వాతే రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేశామని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ఏటా ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహయం అందజేస్తామని చెప్పారు. 

పేదోడి సొమ్ము విదేశాలకు పంపించిన అక్రమార్కుడిపై చట్ట ప్రకారం కేసులు పెడితే ప్రతిపక్షాలు రౌడీళ్లా ప్రవర్తిస్తున్నాయని పరోక్షంగా కేటీఆర్‎పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి. ప్రతిపక్షాల చిల్లర మాటలకు మా పనులే సమాధానం చెప్తాయన్నారు. సోమవారం (జనవరి 6) హనుమకొండ కలెక్టరేట్‎లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. 

అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‎ను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయాలని సీఎం సంకల్పంతో ఉన్నారన్నారు. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్టీసీని అప్ డేట్ చేస్తున్నామని.. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‏కు ఏ టెక్నాలజీ వచ్చినా.. వెంటనే వరంగల్‎కు కూడా ఆ టెక్నాలజీ తీసుకొస్తామన్నారు.