పరకాల సమస్య తీరుస్తం : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

  • ముంపు నివారణ పనుల్లో బొమ్మలు చూపించి బిల్లులు డ్రా చేసుకున్నరు
  • తొందర్లోనే కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్​ స్కీం ప్రారంభిస్తం
  • గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశాలు
  • పరకాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హనుమకొండ/ పరకాల, వెలుగు: పరకాల సమీపంలోని దామెర చెరువు అలుగు పోస్తే పట్టణంలోని ఇండ్లు మునుగుతున్నాయని, భవిష్యత్తులో పరకాలకు ముంపు సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ, హౌజింగ్, మినిస్టర్, వరంగల్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4 కోట్లతో పనులు ప్రారంభించి, కాంట్రాక్టర్ బొమ్మలు చూపించి 80 శాతం బిల్లులు తీసుకున్నారని, పనులు మాత్రం ఆ స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైన్ పొడవు, వెడల్పు టెక్నికల్ గా లేవని, మొత్తం ప్లాన్ తీసుకుని వస్తే పనుల పూర్తికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.

 హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఇతర నేతలతో కలిసి రూ.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్, రూ.11.74 కోట్లతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన చేశారు. కాటమయ్య రక్షక కవచం పథకంలో భాగంగా కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకుల పంపిణీ చేశారు. 

అనంతరం స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, జిల్లా ఇతర అధికారులతో పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసి పాత ఆస్పత్రిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తామన్నారు. నెల రోజుల్లో గ్రౌండ్ ఫ్లోర్​ను పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఇచ్చే భూములు విలువైనవేనని, రైతులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ను  ప్రపంచానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు.

త్వరలోనే కోనాయిమాకుల లిఫ్ట్​ఇరిగేషన్..​

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేశారని, పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లోని 14 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు రూ.41 కోట్లతో టెండర్ కూడా ఫైనల్​ చేశారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతంలోని రిడ్జ్ లో ఈ లిఫ్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కాకతీయ కెనాల్ మీద లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి ఏజెన్సీని ఫైనల్ చేస్తే తెలంగాణ వచ్చిన తరువాత గత సీఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టు అంచనాలను రూ.115 కోట్లకు రివైజ్డ్​ చేశారన్నారు. 

అయినా కొంతవరకే పనులు చేపట్టి మోటర్లు కొన్నారని, కానీ డ్రైరన్ మాత్రం చేయకుండా వదిలేశారని విమర్శించారు. కొద్దిరోజుల్లో ఆ లిఫ్టు ఇరిగేషన్​ పథకాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దాని మైనర్, సబ్ మైనర్ పనులను పక్కనపెట్టి మెయిన్ ట్రంక్​ను నీటితో నింపేందుకు డ్రైరన్ కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టిమేట్ ఫుల్ డీటెయిల్స్ తనకు పంపించాలని, వారం రోజుల్లో కొంత నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. 

భగీరథ బాగోతం బయటపడ్డది..

మిషన్ భగీరథ స్కీం లో భాగంగా ప్రతి ఇంటికి తాగనీరు అందిస్తామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత సర్వేలు చేయిస్తే 51 శాతం ఇండ్లకు తాగునీళ్లు రావడం లేదని తేలిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సర్వేల్లో మిషన్ భగీరథ బాగోతం బయట పడిందని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

 కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ అనిత, పరకాల ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ, మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రివ్యూ మీటింగ్ అనంతరం వరంగల్ జిల్లాలో వివిధ ప్రైవేటు కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు.