ఇందిరమ్మ రాజ్యంలోనే అందరి అభివృద్ధి

  • తొర్రూరు మార్కెట్​ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు 
  •  పాల్గొన్న ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
  • జనగామ, మహబూబాబాద్ కలెక్టర్లతో సమీక్ష 

వర్దన్నపేట, తొర్రూరు/ వెలుగు: ఇందిరమ్మరాజ్యంతోనే అందరి అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  గురువారం  వర్దన్నపేట నియోజకవర్గంలో దాదాపు రూ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో తాగు నీటి ఎద్దడిని నివారించడానికి అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.34 కోట్ల వ్యయంతో పైపు లైన్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

అనంతరం వర్థన్నపేట మండలం చెన్నారం గ్రామం నుంచి పంథిని వరకు రూ. 1.80 కోట్ల వ్యయంతో రోడ్డు, చెన్నారం నుంచి ఆశాలపల్లి వరకు రూ. 3 కోట్ల వ్యయంతో రోడ్డు, ఇల్లంద నుంచి జగ్గయ్యగుండ్ల వరకు రూ. 4 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి లో రూ.1.50 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన బ్లాక్ ను మంత్రి ప్రారంభించా రు. అనంతరం మాట్లాడిన మంత్రి పొంగులేటి,  ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

 నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తామన్నారు.  రైతు రుణమాఫీకి ఇప్పటి వరకు 18 వేల కోట్లు విడుదల చేశా మన్న మంత్రి, త్వర లో 13 వేల కోట్లు విడుదల చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్,  ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్య శారద, టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు పాల్గొన్నారు.  

కలెక్టర్లతో సమీక్ష

 జనగామ, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో తొర్రూరులోని మిషన్ భగీరథ అతిథి గృహంలో అభివృద్ధి పనులపై మంత్రి  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ..  సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.  

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరగా మంజూరు చేయాలని ఆదేశించారు.  కార్యక్రమంలో వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ జనగామ జిల్లా కలెక్టర్లు అద్వైత్ కుమార్ సింగ్, రిజ్వన్ బాషా షేక్, నియోజకవర్గ ఇన్​చార్జ్​ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను పని చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.  త్వరలోనే నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ గృహాలు మంజూరు కానున్నాయన్నారు.  తొర్రూరు పట్టణంలో ట్యాంక్​బాండ్​ నిర్మాణం, వందపడకల ఆస్పత్రితో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. 

వర్ధన్నపేట నియోజకవర్గ పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో తాను పని చేశానని గుర్తు చేసుకున్న ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేతో కలసి నియోజకవర్గ అభివృద్ధి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. 

వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తనను గెలిపించిన ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే నాగరాజు హామీ ఇచ్చారు. వర్ధన్నపేటకు త్వరలోనే మున్సిఫ్ కోర్టు తీసుకొస్తానన్నారు.  తండాలను వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఆకే రు వాగుపై త్వరలోనే చెక్ డ్యామ్ నిర్మాణం చేపడతామన్నారు.  ఎమ్మెల్యే,  వర్ధన్నపేట నియోజక వర్గానికి 5 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి విజ్ఞప్తి చేశారు. 

తొర్రూరు మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం. 

మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మార్కెట్​ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి హాజరయ్యారు.  ఈ సందర్భంగా పట్టణంలోని పాల కేంద్రం నుంచి వ్యవసాయ మార్కెట్​వరకు కాంగ్రెస్​ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఏఎంసీలో  పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రమాణస్వీకార అభినందన సభలో నూతన మార్కెట్​ కమిటీ చైర్మన్​ హనుమాండ్ల తిరుపతిరెడ్డి,  వైస్​ చైర్మన్​ భట్టు నాయక్​, పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహాకారం అందిస్తాన్నారు.