ప్రభాకర్ రావు వస్తే మీరంతా జైలుకే : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  •  కేటీఆర్.. అమృత్ స్కీంలో స్కాం ఎక్కడ జరిగింది?

యాదాద్రి, వెలుగు:  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావు అమెరికా నుంచి ఇండియాకు వస్తే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే పోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లి వచ్చిందన్నారు. తాము జైలుకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా కేటీఆర్, హరీశ్ రావు ఆపారన్నారు. ప్రభాకర్ రావు రాకుండా ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మంత్రి మాట్లాడారు.

 బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టారీతిగా సీఎం రేవంత్ రెడ్డిపై, రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో మూడు నెలలు ఎన్నికల కోడ్ ఉందన్నారు. మిగిలిన ఆరు నెలల్లో అమృత్ స్కీం కింద 8,888 కోట్ల స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్నప్పడు నీ కుటుంబం రూ. 7 లక్షల కోట్లు అప్పుచేసి అందులోంచి రూ. లక్షల కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా? పచ్చ కామెర్లోనికి లోకమంతా పచ్చగా కన్పించినట్టుగా.. దోచుకొని తినేటోనికి మొత్తం దోపిడే కన్పించినట్టుగా ఉంది” అని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో ఒక్క జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సీటు కూడా బీఆర్ఎస్ గెలవదన్నారు. 

కవిత అవినీతిని బయటపెడ్తం

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన అవినీతినంతా బయటపెడతామని మంత్రి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం సీఎల్పీ మీటింగ్ దగ్గర విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నో స్కామ్‌ల్లో ఆమె పాత్ర ఉందని ఆరోపించారు. అమృత్ స్కాంపై కేటీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. టెండర్ వాల్యూ కంటే అవినీతి ఎక్కువ ఎలా జరుగుతుందో ఆయనకే తెలియాలన్నారు. అమృత్ స్కీంకు తమ ప్రభుత్వం రాకముందే టెండర్లు పిలిచారని గుర్తుచేశారు.

  విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమృత్ స్కీం విషయంలో అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ధైర్యంగా ప్రకటించారన్నారు. పొంగులేటి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్దగ్గర ఆన్సర్ లేదన్నారు. రూ.3,516 కోట్ల టెండర్లు పిలిస్తే.. రూ.8 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.