నా చిరకాల కోరిక తీరింది.. సీఎం రేవంత్‎కు థ్యాంక్స్: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావడంతో నా చిరకాల స్వప్నం తీరినట్లైందని.. అందుకు ఈ ప్రాంత రైతుల తరుపున సీఎం రేవంత్‎కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్‎ను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం (డిసెంబర్ 5) పరిశీలించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల పొజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శంఖుస్థాపన చేశారని.. మళ్లీ17సంవత్సరాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ రాజ్యంలో ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని తెలిపారు. 

ఈ నెల 7న సీఎం చేతుల మీదుగా ప్రాజెక్ట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందుతోందన్నారు. ప్రాజెక్ట్ ద్వారా వెళ్లే రైట్, లెఫ్ట్ కెనాల్ విస్తరణ పనులకు సీఎం రేవంత్ అధికారులతో ఇక్కడే సమీక్ష చేస్తారని తెలిపారు. గతంలో నల్లగొండలోని పెండింగులో ఉన్న ప్రాజెక్ట్‎లను కుర్చీ వేసుకొని పూర్తి చేస్తా అన్నాయన ఈ ప్రాజెక్ట్‎ని పదేళ్లు పూర్తిగా పక్కన పడేశాడని పరోక్షంగా కేసీఆర్‎ను విమర్శించారు. ఎస్ఎల్బీసీ త్వరగా పూర్తయితే ఎలాంటి ఖర్చు లేకుండా నీరు నేరుగా పానగల్లు చెరువుకు నీళ్లు వస్తాయని.. అందుకు సీఎం రేవంత్ రూ.1000 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందని అన్నారు. 

ALSO READ | పదేళ్ల పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు తప్ప పేదల ఇళ్లను పట్టించుకోలే: సీఎం రేవంత్ రెడ్డి

జనవరిలో పనులు ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభించి త్వరలోనే పూర్తి చేస్తామని.. తద్వారా సాగర్ కింద ఎలాగైతే రెండు పంటలు పండుతున్నాయో ఇక్కడ కూడా అలాగే సాగునీరు అందిస్తామని చెప్పారు. మూసీని బాగు చేస్తామంటే  బీజేపీ వాళ్ళు దొంగ నిద్రలు చేస్తున్నారని.. వాళ్ళకు మూసీని బాగు చేయడం ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వాళ్ళు మాత్రం నవామి గంగ పేరుతో  రూ.30వేల కోట్లతో గంగా నదిని శుద్ధి చేస్తే ఏం కాదు.. మేము మూసీని శుద్ధి చేస్తామంటే అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. మూసీ శుద్ధీకరణ చేయడం నకిరేకల్, నల్లగొండ ప్రజలకు ఎంతో అవసరమని.. అది జిల్లా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయమని అన్నారు.