కేసీఆర్​కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  • అవినీతిపై మేము నిలదీస్తామని భయపడ్తున్నరు: మంత్రి వెంకట్ రెడ్డి
  • బీఆర్ఎస్ పాలనలోఏం అభివృద్ధి జరగలే..
  • ఇప్పుడేమో మాకే నీతులు చెప్తున్నరని ఫైర్

నల్గొండ అర్బన్, వెలుగు: కేసీఆర్​కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకుపోతున్నదని తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రిలో రూ.38 కోట్లతో నిర్మించతలపెట్టిన సోమన్నవాగు హైలెవల్ వంతెన, కొత్తపల్లి–పగిడిమర్రి రోడ్డు పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు.

‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిలదీస్తామన్న భయంతోనే కేసీఆర్ బయటికి రావడం లేదు. అసెంబ్లీకి రావాలన్న భయపడుతున్నడు. ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ జరిగితే.. ఒక్కసారి కూడా రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కొడుకు, కూతురు, అల్లుడు గురించే పట్టించుకున్నడు. ప్రజా సమస్యలు పరిష్కరించలేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా బిడ్డలంతా కలిసి కేసీఆర్​కు బుద్ధి చెప్పిన్రు’’అని మంత్రి అన్నారు.

ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నరు

పదేండ్లు అధికారంలో ఉండి కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి కేసీఆర్ పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎస్​ఎల్బీసీ సొరంగం పనుల వైపు తొంగి చూడలేదు. వర్క్స్ పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లా రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందేది. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడేమో.. నీతులు చెప్తున్నరు. మేము చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నరు.

పొద్దున లేచినప్పటి నుంచి ప్రభుత్వాన్ని తిట్టడమే కేటీఆర్, హరీశ్ పనిగా పెట్టుకున్నరు. మూసీ కారణంగా జిల్లా ప్రజలు ఎంతో ఇబ్బందిపడ్తున్నరు. మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తుంటే అడ్డుతగులుతున్నరు. మూసీ పునరుజ్జీవంతోనే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. కొంత లేట్ అయినా.. రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసి తీరుతం. ’’అని మంత్రి తెలిపారు.