రౌడీషీటర్లతో దాడి చేయించారు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • కలెక్టర్ పై దాడి.. కేసీఆర్, కేటీఆర్‌ల కుట్ర: కోమటిరెడ్డి 
  • ఫార్ములా వన్‌ రేస్‌లో అక్రమంగా రూ.54 కోట్ల చెల్లింపులు
  • అరవింద్‌కుమార్‌, కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయమన్న మంత్రి
  • వారం రోజుల్లో మొత్తం వడ్లను కొంటామని వెల్లడి   

నల్గొండ, వెలుగు :  బీఆర్ఎస్‌ లీడర్లు బరితెగించి ఆఫీసర్లపై దాడులు చేస్తున్నారని, ప్లాన్‌ ప్రకారమే రౌడీషీటర్లను పెట్టి వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దాడి చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వాళ్లందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంత పెద్ద దాడి జరిగినా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ మాట్లాడడం లేదని, ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అధికారం కోల్పోవడంతో ఫ్రస్టేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని, దాడికి పాల్పడిన నేతలు కేటీఆర్‌తో కూడా టచ్‌లోనే ఉన్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలపొచ్చు.. కానీ కలెక్టర్‌పై దాడి సరికాదన్నారు. అమెరికాలో చదివిన కేటీఆర్‌ ఒక జిల్లా మెజిస్ట్రేట్‌పై దాడిని సమర్థించడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ హయాంలో మల్లన్న సాగర్, గుండ్ల పోచమ్మ ప్రాజెక్టుల కోసం పోలీసులను పెట్టి 50 వేల ఎకరాలు సేకరించారన్నారు. అప్పుడు తాము నిరసనలు, రిక్వెస్టులు చేశామే తప్ప ఎన్నడూ దాడులు చేయలేదన్నారు. తాము రెచ్చగొట్టి దాడులు చేయిస్తే ప్రాజెక్టులు కట్టేవారే కాదన్నారు. 

కేటీఆర్ త్వరలోనే జైలుకు..

ఫార్ములా1 రేస్‌ కేసులో ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.54 కోట్లు లండన్‌కు తరలించి బోగస్‌ ఈవెంట్ కు చెల్లించారని, ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్, కేటీఆర్ త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి చెప్పారు. 15 రోజుల కింద ఏసీబీ అధికారులు గవర్నర్‌కు లెటర్‌ రాశారని, అక్కడి నుంచి ఆదేశాలు రాగానే అరెస్టులు తప్పవన్నారు. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనే ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాను కేటీఆర్ కలిశారన్నారు. ఇక ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కేసులో 70 శాతం మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ దాక్కున్నా జైలుకు వెళ్లక తప్పదన్నారు. కాగా, రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా పత్తి కొనుగోళ్లపై నోరు మెదపడం లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పత్తికి మద్దతు ధర గురించి ఎందుకు మాట్లాడడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులంతా మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటామని అంటున్నారు తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదన్నారు. తాము వారం రోజుల్లో మొత్తం వడ్లను కొంటామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోతలు మొదలయ్యాయని, రైస్‌ మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.