పనికిరాని కాళేశ్వరం కట్టి 7 లక్షల కోట్ల అప్పు : మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: కేసీఆర్.. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని, పేద బిడ్డల చదువును పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.  ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బ్రాహ్మణుల ప్రాజెక్టుని పరిశీలించారు. వచ్చే మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రాజెక్టు ప్రారంభిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని చెప్పారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.