తెలంగాణలో కరువు పాపం కేసీఆర్​దే: మంత్రి కోమటిరెడ్డి

  • బిడ్డ అరెస్ట్​, ఫోన్​ట్యాపింగ్​ కేసుల నుంచి ప్రజలను డైవర్ట్​ చేసేందుకే పొలంబాట పట్టిండు
  • నాడు ఉద్యమకారులను సూసైడ్​లకు ఉసిగొల్పిన్రు.. నేడు రైతులు చచ్చిపోవాలని కోరుకుంటున్నరు
  • కరువుతో నష్టపోయిన రైతులను సర్కారు ఆదుకుంటుందని వెల్లడి

సూర్యాపేట/తుంగతుర్తి, వెలుగు:  కేసీఆర్​ ఫ్యామిలీ ఇకనైనా శవరాజకీయాలు మానుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. ‘మీ స్వార్థం కోసం నాడు ఉద్యమకారులను ఆత్మహత్యలకు ఉసిగొల్పిన్రు. మీరు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నా మీకు మాత్రం అగ్గిపెట్టె దొరకలేదు. కానీ వందలమందిని బలిగొన్నరు. ఇప్పుడు అధికారం కోల్పోగానే రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలని కోరుకుంటున్నరు’ అని బీఆర్​ఎస్​ పార్టీపై మండిపడ్డారు. పదేండ్లపాటు ఫాం హౌస్ కే పరిమితమైన కే‌సీ‌ఆర్.. ఇప్పుడు అధికారం కోల్పోయి,  బిడ్డ జైలుకు పోయి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫ్యామిలీ మొత్తం జైలుకుపోతామన్న భయం పట్టుకోవడం వల్లే  ప్రజలను డైవర్ట్ చేసేందుకు పొలంబాట పట్టారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం  అడి వేముల గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ట మహోత్సవంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.  కరువు మూలంగా అప్పుల పాలై రైతులెవరూ చనిపోలేదని అన్నారు. కరువుతో పంట పొలాలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. 

తెలంగాణలో కరువు వచ్చింది కే‌సీ‌ఆర్ చేసిన పాపాల వల్లేనని, ఆయన రూ. 2 లక్షల కోట్లతో కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని విమర్శించారు. డబ్బులకు ఆశపడి జగన్ మోహన్ రెడ్డితో కలిసి కృష్ణా ప్రాజెక్టులను గోదావరి నీటితో నింపుతామని చెప్పి పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, రాయలసీమ  లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఏపీకి తరలించేలా కేసీఆర్​ కుట్ర చేశారన్నారు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతోనే  దక్షిణ తెలంగాణలో  బీ‌ఆర్‌ఎస్  పార్టీ 40 నుంచి 70 వేల మెజార్టీ తేడాతో  ఓడిపోయిందన్నారు. రూ.2 వేల కోట్లు ఇస్తే  ఎస్‌ఎల్‌బీసీ పూర్తి అయ్యి కరువులో కూడా  నీళ్లు వచ్చేవని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, బ్రాహ్మణ వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.3,300 కోట్లు కేటాయించామని, నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. 4 నెలల క్రితమే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపామని, కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 14 –15 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్​

ఇసుక, భూదందాలు చేసి బీఆర్​ఎస్​ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ రైతులకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. ఆత్మహత్యలను ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దళితుడిని సీఎంని చేస్తానని చెప్పి దగా చేసిన దగాకోరు  కేసీఆర్​ అని ఫైర్ అయ్యారు. అబద్ధాలు మాట్లాడటంలో మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డికి ఉత్తమ ప్రశంసా అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.  ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదు

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 11 గెలిచామని, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్ ​పార్టీ ఖాళీ అయిందని చెప్పారు. నల్గొండ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సూర్యాపేటలో ఇసుక అమ్ముకొని దోచుకున్న డబ్బులు ఖర్చుపెట్టి జగదీశ్ రెడ్డి 3 వేల ఓట్లతో గెలిచాడని, అది గెలుపే కాదని  ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను జగదీశ్ రెడ్డి నాశనం చేశాడని మండిపడ్డారు.  రాష్ట్రాన్ని పదేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇచ్చిన హామీలు సగం నెరవేర్చామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ  రూ.7 లక్షల కోట్లు దోపిడీ చేసి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, భద్రాద్రి రాముల వారి పాదాల సాక్షిగా జూన్ 4 నుంచి ఒక్కో నియోజక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 ఇండ్లు కేటాయిస్తున్నదని తెలిపారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.50 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెస్ కట్టిన ఔటర్ రింగ్ రోడ్డును ఎన్నికల ముందు రూ.7 వేల కోట్లకు కమీషన్లు తీసుకొని కే‌సీ‌ఆర్ అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రూపు రేఖలు మార్చేలా ఔటర్ రింగ్ రోడ్డు ప్యారలాల్​గా రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై విచారణ చేపట్టి, బాధ్యులను జైలుకు పంపడం ఖాయమన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​ రెడ్డిని 3 లక్షల నుంచి 5 లక్షల  భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.