కేటీఆర్​కు 25 ఎకరాల్లో ఫామ్​హౌస్ ఉన్నది : మంత్రి వెంకట్​రెడ్డి

  • నేనే వెళ్లి చూసిన.. వర్కర్లతో శైలిమ పనులు చేయిస్తున్నరు: మంత్రి వెంకట్​రెడ్డి
  • జీవో 111 పరిధిలోనే  ఫామ్​హౌస్ కట్టారని వ్యాఖ్య
  • రూల్స్​కు విరుద్ధంగా ఉంటే హైడ్రానే కూల్చేస్తది
  • కేటీఆర్​ను వెంటనే డాక్టర్​కు చూపించాలి
  • ఎప్పుడు ఏం మాట్లాడుతున్నడో తెల్వట్లేదని ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌పల్లి మండలంలోని జన్వాడలో కేటీఆర్​కు 25 ఎకరాల్లో ఫామ్​హౌస్ ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. జీవో 111 పరిధిలోనే ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందన్నారు. తాను స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఫామ్ హౌస్​లోకి వెళ్లానని తెలిపారు. అప్పుడు వర్కర్లతో కేటీఆర్ భార్య శైలిమ పనులు చేయిస్తున్నారన్నారు.

సెక్రటేరియెట్​లో బుధవారం మంత్రి వెంకట్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘హైడ్రా పనితీరును అందరూ అభినందిస్తున్నరు. రూల్స్ కు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటే హైడ్రా అధికారులే కూల్చేస్తరు. సినియా యాక్టర్ల ఫామ్ హౌస్​లు ఉన్నా కూల్చేస్తరు. రేవంత్ రెడ్డికి ఫామ్​హౌస్ ఉందని కొందరు విమర్శిస్తున్నరు. ఎక్కడుందో వాళ్లే వచ్చి చూపించాలి. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నడో అర్థం కావట్లేదు. అతన్ని డాక్టర్​కు చూపించాలని వాళ్ల ఫ్యామిలీని కోరుతున్న.

ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కేటీఆర్ ఓ యువకుడు.. ఆయనకు ఏమైనా అయితే ఇబ్బంది అయితది. ఆయన్ని చూస్తే జాలేస్తున్నది. అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్​లో ఏదేదో మాట్లాడుతున్నడు. పదేండ్లలో ఒక్కసారి కూడా అంబేద్కర్​కు దండ వేయలేని సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతడు’’అని వెంకట్ రెడ్డి అన్నారు.

రాజీవ్ విగ్రహం పెడితే తప్పేంటి?

రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు విడిచారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన విగ్రహం పెడ్తే తప్పేంటని ప్రశ్నించారు. వాజ్​పేయి విగ్రహం కూడా పెట్టాలన్నారు. ‘‘కేటీఆర్ తెలంగాణ కోసం దెబ్బలు తిన్నడా? చావు నోట్లో తలకాయ పెడితే బయటికి రారు.. శ్రీకాంతా చారి మాదిరి అమరులు అవుతరు. కానీ.. కేసీఆర్ ఎలా బయటికి వచ్చిండు? నా నియోజకవర్గ అభివృద్ధికి రూ.6వేల కోట్లు ఖర్చు పెట్టిన. అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజార్టీ వచ్చింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినయ్.

ఫోర్త్ సిటీకి 16 రేడియల్ రోడ్లు నిర్మించాని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్–విజయవాడ రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్​ కమిటీ ఆమోదం తెలిపింది’’అని వెంకట్​రెడ్డి అన్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నరు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. నేషనల్ హైవే, త్రిపుల్ ఆర్, ఫ్లై ఓవర్ల వంటి పెండింగ్ పనులపై ఆయనతో చర్చించనున్నారు.

బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది!

ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు చెరువులను మాయం చేశారని మంత్రి వెంకట్​రెడ్డి ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఫ్యామిలీ చెరువు భూములను నిషేధిత జాబితాలోకి చేర్చి తమ పేర్ల మీద మార్చుకున్నరు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తామంటుంటే నవ్వొస్తున్నది. బీఆర్ఎస్ రాజకీయాలు పాతాళానికి దిగజారిపోయాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు..

ప్రభుత్వం చేసే మంచి పనులపై బురద చల్లుతున్నరు. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నరు’’అని వెంకట్ రెడ్డి అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు. కేటీఆర్, హరీశ్ రావును బీజేపీ లీడర్లని పిలవాలంటూ ఎద్దేవా చేశారు.