ధరణి స్థానంలో భూమాతను తెస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

  • ధరణి సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది
  • నల్గొండ అర్బన్ కు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ , వెలుగు : గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల అనేక అక్రమాలు జరిగాయని, దాని స్థానంలో భూమాతను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం బాగుందన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ముందంజలో ఉందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో జిల్లా వ్యాప్తంగా 27,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఆ సంఖ్యను 4000 కు తీసుకొచ్చారని తెలిపారు. నల్గొండ పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరుగా తహసీల్దార్ కార్యాలయాలు అవసరమని, ఇందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ను ఆదేశించారు. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని రూ.25 లక్షలతో పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్​చార్జి ఆర్డీవో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.