విచారణ వద్దంటే అవినీతిని ఒప్పుకున్నట్టే : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

  •     కేసీ‌ఆర్ ఫ్యామిలీ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి వెంకట్​రెడ్డి
  •     యాదాద్రి పవర్ ప్లాంట్​లో రూ.10 వేల కోట్ల అవినీతి 
  •     అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా?
  •     త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కామెంట్ 

సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్​ హయాంలో జరిగిన విద్యుత్​ కొనుగోళ్లపై విచారణ వద్దని కేసీఆర్​ అంటున్నారంటే.. ఆయన అవినీతి చేసినట్టు ఒప్పుకున్నట్టేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కేసీఆర్​కు అరెస్ట్ భయం పట్టుకున్నదని, అందుకే రిటైర్డ్ జడ్జితో విచారణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా నూతన్​కల్ మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గవర్నమెంట్ స్కూల్ ​స్టూడెంట్స్​కు వెంకట్​రెడ్డి యూనిఫామ్స్, నోట్ బుక్స్ అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దమ్ముంటే విచారణ చేయాలని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చుతున్నారని అన్నారు. 

జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయతీకి మారుపేరని, దేశానికి ఆదర్శంగా ఉన్న వ్యక్తితో యాదాద్రి పవర్ ప్లాంట్​పై విచారణ చేస్తుంటే కే‌‌‌‌‌‌‌‌సీ‌‌‌‌‌‌‌‌ఆర్ వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. చట్టబద్ధ కమిషన్ మీదే నమ్మకం లేదంటే ప్రజస్వామ్యం ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు. అవినీతి చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా? అని ఫైర్​ అయ్యారు. రూ.30 వేల కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్​ పవర్ ప్లాంట్​లో రూ.10 వేల కోట్ల అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి సబ్ కాంట్రాక్టుల పేరు మీద బీఆర్ఎస్ నాయకులకు నామినేషన్ ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో మాజీ మంత్రి జగదీశ్​రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై అసెంబ్లీ లో ఆధారాలతో సహా తాము బయటపెట్టామని చెప్పారు. దీనిపై స్పందించిన సీ‌‌‌‌‌‌‌‌ఎం రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్​పై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించారని తెలిపారు. కమిషన్​ ఇచ్చిన నోటీసులపై జూన్ 30 వరకు సమాధానం ఇస్తామని చెప్పిన కే‌‌‌‌‌‌‌‌సీఆర్.. ఇప్పుడు కమిషన్ రద్దు చేయాలని, కమిషన్​పై నమ్మకం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. 

గొర్రెల స్కీమ్​​లో రూ.700 కోట్ల​ అవినీతి

గొర్రెల స్కీమ్ లో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై ఎంక్వైరీ నడుస్తున్నదని మంత్రి చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​తో కుమ్మక్కై రూ.11 వందల కోట్ల అవినీతి చేసిన కేసీఆర్​ కూతురు కవిత జైలు పాలయ్యారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కడ జైలుకు వెళ్తామోనన్న భయంతో ప్రభాకర్ రావును కేసీఆరే అమెరికా పంపించారని, అమెరికాలో ప్రభాకర్ రావును హరీశ్ కలిశారని ఆరోపించారు. కేసీ‌‌‌‌‌‌‌‌ఆర్ చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారని, కేసీ‌‌‌‌‌‌‌‌ఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. కే‌‌‌‌‌‌‌‌సీఆర్10 ఏండ్లలో అందరి కొంపలు ముంచి  లక్షల కోట్లు తిన్నారని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో 7 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందని చెప్పారు. 

త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని, 36 మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. సంతోష్ రావు, వినోద్ కుమార్, కేటీఆర్ కలిసి కే‌‌‌‌‌‌‌‌సీఆర్​ను ఒప్పించి పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీలో చర్చలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ​స్కాంలన్నింటినీ బయటకు తీసేందుకు తమకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. జగదీశ్​రెడ్డితో పాటు ఇక్కడి మాజీ ఎమ్మెల్యే ఇసుక దోచుకొని వేల కోట్లు తిన్నారని, తుంగతుర్తిని నాశనం చేశారని మండిపడ్డారు. తుంగతుర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, రెగ్యులర్​గా గోదావరి నీళ్లను తెచ్చేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.