దీపావళి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : దీపావళి తర్వాత నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం సమీపంలోని సోమన్నవాగు వద్ద రూ.38 కోట్లతో మూడు డబుల్ రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా మట్టిరోడ్డు అన్నదే లేకుండా రహదారులు నిర్మిస్తామన్నారు.

రానున్న రెండేండ్లలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఆర్ అండ్ బీ రహదారులకు రూ.600 కోట్ల మంజూరు చేసినట్టు చెప్పారు. కనగల్ జంక్షన్ ను రూ.8 కోట్లతో వెడల్పు చేసి, అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.38 కోట్లతో చేపట్టిన డబుల్ రోడ్డు పనులను బుధవారం నుంచి ప్రారంభించి పది నెలల్లో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

నవంబర్ లో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు, బ్రాహ్మణ వెల్లంలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ ఎన్ని మాట్లాడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. అనంతరం ముషంపల్లి ఆర్ అండ్ బీ రహదారి నుంచి ఐతవారిగూడెం వరకు రూ.95 లక్షలతో నిర్మించనున్న సీపీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి..

నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నూతన కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. నూతన నల్గొండ జిల్లా కలెక్టర్ గా సోమవారం బాధ్యతలు తీసుకున్న ఇలా త్రిపాఠి మంగళవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలతో వివిధ అంశాలపై చర్చించారు.